
సర్వజనాస్పత్రి ‘ఎన్‌ఆర్‌సీ’లో కానరాని మార్పు
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి లోని న్యూట్రీషినల్ రీహాబిలిటేషన్ సెంటర్(ఎన్‌ఆర్ సీ)లో తీరు మారడం లేదు. ‘చిన్నారులకు అందించే డైట్‌పై నిర్లక్ష్యం చేయకూడదు’ అని ఇటీవల సాక్షాత్తు కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ ఆకలితో అలమటిస్తున్న పిల్లలను చూస్తే అయ్యో అంటూ జాలిపడాల్సిందే. ఆరోగ్య శాఖ.. సర్వజనాస్పత్రి అధికారుల బాధ్యతారాహిత్యం చిన్నారులకు శాపంగా మారింది. గ్లాసు పాల కోసం మూడు నాలుగు గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక.. ఎన్‌ఆర్‌సీలో వంట మనిషి లేకపోవడంతో రోజూ ఉదయం, మధ్యాహ్నం పాయసంతోనే అల్పాహారాన్ని సరిపెడుతున్నట్లు తెలిసింది.
ఇదిగో సాక్ష్యం..
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న తన ఇద్దరు బిడ్డలను (ఒకరు మూడేళ్లు, ఒకరికి 7 నెలలు) తాడిపత్రికి చెందిన శ్రావణి ఎన్‌ఆర్‌సీలో చేర్చింది. ఈ పిల్లలకు ఉదయం 6 గంటలకే ఎన్‌ఆర్‌సీలో సిబ్బంది పాలు పంపిణీ చేయాలి. కానీ ఆదివారం 9 గంటలైనా ఇవ్వలేదు. దీంతో పిల్లలు కడుపు కాలి ఏడుస్తుండటంతో చేసేదిలేక శ్రావణి ఆస్పత్రి బయట ఇడ్లీ తీసుకుని వచ్చి వారి పొట్ట నింపింది. మరో మహిళ కూడా తన బిడ్డ బాధను చూసి తట్టుకోలేక బయట తోపుడు బండ్లపై దోసె తీసుకువచ్చి ఆకలి తీర్చింది. ఇటీవల ‘సాక్షి’లో ‘చిన్నారుల ఆకలి కేకలు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా.. ఆ మరుసటి రోజు వైద్య ఆరోగ్యశాఖాధికారులు, సర్వజనాస్పత్రి అధికారులు ఎన్‌ఆర్‌సీకి వచ్చి హడావుడి చేశారు. ఆ తర్వాత నుంచి షరామామూలుగానే పరిస్థితి తయారైంది.
రెండు రోజులు సర్దుకో..
‘ఎన్‌ఆర్‌సీలో ఉంటే మంచి తిండి పెడతారని చెప్పారు. కానీ ఇక్కడేమో ఆ పరిస్థితి కనిపించడం లేదు సార్’ అంటూ ఓ వృద్ధురాలు ఇటీవల డ్యూటీ వైద్యున్ని ప్రశ్నించగా.. సదరు వైద్యుడు ‘రెండు రోజులు సర్దుకొండహే’ అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవంగా అతను విధులకు ఎప్పుడూ గైర్హాజరవుతుంటాడని, కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తుంటాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూట్రీషియన్లు సౌజన్య, పల్లవి కూడా విధులకు తరచూ డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ ఓ న్యూట్రీíÙయన్ సెలవులో వెళ్లి, జీతం మాత్రం తీసుకున్నట్లు తెల్సింది. రూ.లక్షలు జీతాలు తీసుకుంటూ చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న వారిపై కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.