రాయలసీమకు మరో రెండు రహదారులు

Two more Major Roads Have Been Sanctioned for Rayalaseema - Sakshi

రూ.1,600 కోట్లతో ముద్దునూరు–హిందూపూర్‌కు.. 

రూ.400కోట్లతో నంద్యాల–జమ్మలమడుగుకు రోడ్డు

సాక్షి, అమరావతి: రాయలసీమకు మరో రెండు ప్రధాన రహదారులు మంజూరయ్యాయి. వైఎస్సార్‌ జిల్లాను అనంతపురం, కర్నూలు జిల్లాలతో మరింతగా అనుసంధానిస్తూ రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గతంలో ఎన్నడూలేని రీతిలో 2021–22 వార్షిక ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.6,421కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రణాళికలో భాగంగా చేపట్టే పనుల్లో ఆర్‌ అండ్‌ బీ శాఖ ఈ రెండు రోడ్లను కూడా తాజాగా ప్రతిపాదించింది. అందుకోసం రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికను ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) రూపొందించే ప్రక్రియను చేపట్టింది. 

ముద్దునూరు– హిందూపూర్‌ మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారిని నిర్మించాలని నిర్ణయించారు. ఈ రహదారిని పులివెందుల, కదిరి మీదుగా హిందూపూర్‌ వరకూ 159 కి.మీ. మేర  నిర్మిస్తారు. అందుకు రూ.1,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం మూడు ప్యాకేజీల కింద టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. 

కర్నూలు జిల్లా నంద్యాల నుంచి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు వరకు ‘పావ్డ్‌ సోల్డర్స్‌(డబుల్‌ లైన్ల రోడ్డుకి రెండు వైపులా మరో 3 మీటర్లు  కలిపి  కలిపి అదనంగా.. 7+3) రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 88 కి.మీ.మేర నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి రూ.400 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. 

చదవండి: (ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం: పేర్ని నాని)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top