
సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చిన తరుణంలో ఏర్పాట్లు... భద్రత వంటి చర్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏడుగురు భక్తుల ప్రాణాలను గాలిలో కలిపేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు బయటపడుతున్న పలు లోపాలు చూస్తూ భక్తులు విష్టి పోతున్నారు. అతి తక్కువ సమయంలో గోడ నిర్మించలేనని కాంట్రాక్టర్ చెప్పినప్పటికీ పరవాలేదు మేము చూసుకుంటాం ఏదోలా పూర్తిచేసేయ్ అంటూ దేవాలయ యాజమాన్యం మంత్రులు తనపై ఒత్తిడి చేసి తూతూ మంత్రంగా పనులు పూర్తి చేయించారని కాంట్రాక్టర్ అంగీకరించారు.
ఇదిలా ఉండగా ఉత్సవానికి ముందు పలువురు మంత్రులు సింహాచలాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు పరిశీలించినట్లు సూచనలు సలహాలు ఇచ్చినట్లు పత్రికల్లో కథనాలు ఫోటోలు అయితే వేయించుకున్నారు కానీ వారు ఎక్కడ ఏమి చూసినట్లు లేదు. అలా వచ్చి మామూలుగా అధికారులతో సమావేశమై జ్యూస్ తాగి స్నాక్స్ తిని వెళ్లిపోయారు అన్నది ఈ సంఘటన తర్వాత అర్థమవుతుంది. ఇదంతా ఎలా ఉండగా సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఈ అంశంపై ఇంతవరకు కిక్కురుమనలేదు. గతంలో ఆయన ధర్మకర్తృత్వం లోని రామతీర్థం గుట్టపై శ్రీరాముని విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన ఘటన కు సంబంధించి ఆయన స్పందన విపరీతంగా ఉండేది. కళ్ళు ఎగరేస్తూ గాలిలో చేతులు తిప్పుతూ నాటి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తూలనాడారు. చైర్మన్ అయిన తనకు కూడా ఏమాత్రం సమాచారం లేదని బాధ్యత వహిస్తే పరిస్థితి వేరుగా ఉండేది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నాటి సంఘటనకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి బాధ్యత అని దుమ్మెత్తి పోశారు.
నేడు సౌండ్ లేదేం అశోక్ రాజా
నేడు సింహాచలం అప్పన్న స్వామికి చందనోత్సవం సందర్భంగా తొలి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పించేది కూడా విజయనగరం పూసపాటి కుటుంబీకులే. గతంలో ఆనందగజపతి రాజు ఈ సాంప్రదాయం పాటించగా నేడు అశోక్ గజపతి అప్పన్నకు చైర్మన్ హోదాలో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. మరి దేవాలయ చైర్మన్గా ఆయనకు ఈ దుర్ఘటనతో సంబంధం లేదా..? బాధ్యత లేదా ? అంత పెద్ద ప్రమాదం జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయి మరికొందరు ఆసుపత్రిపాలవగా ఆయన మాత్రం ఏ మాత్రం నోరు విప్పడం లేదు.
ఉత్సవాలకు ముందు మంత్రులతో పాటు ఆయన కూడా సమీక్షలో పాల్గొని ఆహా ఓహో అది చేశాను ఇది చేశాం అంటూ ఫోటోలు ప్రకటనలు ఇచ్చి ఇంటికి వచ్చారు తప్ప ప్రమాదం జరిగి ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఆయన ఏమాత్రం స్పందించడం గాని.. దేవాలయ ట్రస్ట్ బోర్డు తరఫున ఓ ప్రకటన కానీ ఇవ్వలేదు.. అసలు ఆ సంఘటన జరిగినట్లే ఆయన గుర్తించినట్లు కనిపించలేదు. ఎందుకంటే తాను కొనసాగుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏ ఆలయంలో ఏం జరిగినా ఆయనకు కనిపించదు.. వినిపించదు. అదే వైయస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా చిత్ర విచిత్రమైన అభినయాలతో అశోక్ గజపతి మీడియా ముందుకు వచ్చేస్తారు.. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కూడా ఆయన నోరు విప్పితే తన హుందాతనానికి మరింత గౌరవం వచ్చేదని ప్రజలు అంటున్నారు
::సిమ్మాదిరప్పన్న