మూడు రాజధానులపై మొదలైన విచారణ

Trial began on three capitals at AP High Court - Sakshi

ఆ ఇద్దరు జడ్జీలు విచారణ నుంచి తప్పుకోవాలి 

రాజధాని ప్రాంతంలో వారు స్థలాలు కొన్నారు 

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం 

కుదరదన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా   

సాక్షి, అమరావతి: మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరిగి రోజూవారీ విచారణ ప్రారంభించింది. విచారణ మొదటిరోజే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ధర్మాసనాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి పిటిషన్‌ దాఖలు చేశారు. రాజధాని పరిధిలో న్యాయమూర్తులకు అప్పటి ప్రభుత్వం చదరపు గజం రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికి 600 గజాల స్థలం కేటాయించిందని ఆ పిటిషన్‌లో తెలిపారు. ప్రస్తుతం ధర్మాసనంలో ఉన్న జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ సోమయాజులు కూడా ఆ స్థలాలు తీసుకున్నారని, అందువల్ల వారు ఈ మూడు రాజధానుల వ్యవహారంపై విచారణ జరపడం సబబుకాదని పేర్కొన్నారు.

స్థలాల కొనుగోలు ద్వారా పెట్టుబడి సంబంధిత ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున వారు ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే అభ్యర్థించారు. న్యాయం జరగడమే కాక, జరిగినట్లు కూడా కనిపించాలన్నారు. ఇది సదుద్దేశంతో చేస్తున్న అభ్యర్థన అని వివరించారు. త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఇందుకు అభ్యంతరం తెలిపారు. కేసు విచారణ నుంచి తప్పుకోవడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న తాను కూడా విచారణ నుంచి తప్పుకోవాలా? అని ప్రశ్నించారు. ఇలా అయితే ఏదో ఒక సాకు చూపి ప్రతి ఒక్కరూ ప్రతి జడ్జిని కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరతారన్నారు. ఈ కేసులో తమ ధర్మాసనమే వాదనలు వింటుందని తేల్చి చెప్పారు. 

ఏదో ఒక నిర్ణయం చెప్పండి.. సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం..
విచారణ నుంచి తప్పుకోవాలన్న తమ పిటిషన్‌పై ఏదో ఒక నిర్ణయం వెలువరించాలని సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే సీజేను కోరారు. తమ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. దానిపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామన్నారు. మీ అభ్యర్థనను తిరస్కరిస్తామని సీజే చెప్పగా.. లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని దవే అభ్యర్థించారు. ఈ దశలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని,  తుది తీర్పు ఇచ్చే సమయంలో విచారణ నుంచి తప్పుకోవాలన్న పిటిషన్‌పై ఉత్తర్వులు ఇస్తామని సీజే చెప్పారు. అప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని దవే తెలిపారు. 

అభివృద్ధి స్తంభించిపోయింది
సీజే స్పందిస్తూ.. ఏడాది కాలంగా ఈ కేసు ముందుకెళ్లడం లేదన్నారు. ఇక ఈ కేసు ముందుకెళ్లాల్సిందే నని, ఎన్నిరోజులైనా సరే ముందుకెళుతుందని, రోజువారీ విచారణ చేపడతామని చెప్పారు. ఈ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయిందని, వీటిగురించి అందరూ ఎదురుచూస్తున్నారని తెలిపారు. దవే స్పందిస్తూ.. విచారిస్తున్న కేసు విషయంలో న్యాయమూర్తులకు ప్రయోజనాలుంటే, వారే స్వచ్ఛందంగా విచారణ నుంచి తప్పుకోవాలన్నారు. అలా ప్రయోజనాలున్న న్యాయమూర్తులు ఆ కేసును విచారించడానికి అనర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని వివరించారు. జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ సోమయాజులు విషయంలో తమ అభ్యంతరాలను రికార్డు చేయాలని ఆయన అభ్యర్థించగా ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. 

ఇదే అంశంపై ఎప్పుడో వేసిన పిటిషన్‌ విచారణకు రాలేదు
అంతకుముందు న్యాయవాది సింహంభట్ల శరత్‌ కుమార్‌ ఇదే అభ్యర్థనను లేవనెత్తారు. ఈ అంశంపై గతంలోనే వేసిన పిటిషన్‌ విచారణకు నోచుకోలేదని చెప్పారు. ఈ రోజు విచారణ జాబితాలో కూడా తన కేసు లేదని తెలిపారు. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులకు ఈ కేసులో ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నందునే వారిని విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతున్నామని, వారి విశ్వసనీయతపై తమకు సందేహం లేదని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top