ప్రకృతి ఒడిలో పల్లవించే సంగీతం | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో పల్లవించే సంగీతం

Published Mon, May 20 2024 4:29 AM

Traditional in western agency

సంప్రదాయ నృత్యాలే... ఆదివాసీలకు ఆనందం  

పండగలు, శుభకార్యాల్లో లయబద్ధంగా ఆటపాటలు 

శాస్త్రీయం కాకున్నా.. అందరినీ చిందేయించే వాయిద్యాలు 

కల్మషం ఎరుగని సంగీతంతో అందరినీ అలరించే సామర్థ్యం 

పశ్చిమ ఏజెన్సీలో ఇప్పటికీ వినిపించే సంప్రదాయ 

వాయిద్యాలు వారికి సరిగమలు తెలియవు. శృతి లయలు అసలే తెలీదు. కానీ శ్రవణానందంగా పాడగలరు. శ్రోతలను రంజింపజేయగలరు. తకిట తథిమి అనే సప్తపదులు నేర్చుకోలేదు. కానీ లయ బద్ధంగా అడుగులు వేయగలరు. సంప్రదాయ నృత్యరీతుల్లో ఎన్ని మార్పులొచ్చినా... తరతరాలుగా అలవాటైన పద విన్యాసాలనే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ప్రకృతిని పరవశింపజేస్తున్నారు. 

ఇందుకోసం వినియోగించే వాయిద్య పరికరాలు కూడా వారు సొంతంగా తయారు చేసుకున్నవే. ఇంతగొప్ప నైపుణ్యం గలిగిన వీరు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జీవిస్తున్నారు. పురాతనంగా వస్తున్న సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తూప్రకృతి ప్రసాదించిన అడవితల్లి ఒడిలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి జీవనం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. 

బుట్టాయగూడెం: దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కొండరెడ్డి గిరిజనుల జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. సంస్కృతీ, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. వీరికి బయటి ప్రపంచంతో పనిలేదు. అటవీ ప్రాంతమే వారికి ఆలవాలం. చుట్టూ కొండకోనలు వాగు వంకలతో అలరారే గిరి పల్లెల్లో ప్రకృతి నేరి్పన సంగీతం, నాట్యంతోనే జీవితాన్ని ఆనందంగా మలచుకుంటున్నారు.

గిరిజనుల్లోనే కోయ తెగకు చెందిన వారు ‘రేరేలయ్య.. రేల... రేరేలా... రేలా..’ అంటూ పాడుకుంటే... కొండరెడ్లు ‘జొన్నకూడు.. జొన్న విల్లు.. జొన్నకూలితే.. పోతేనత్త’ అంటూ కొత్త పంటలు వచ్చిన సమయంలో పసుపు పచ్చ పండగ, మామిడి పండగ, చింత పండగ, భూదేవి పండగల్లో పాడుకుంటారు. 

అలాగే పెళ్లిళ్ల సమయంలో కొండరెడ్లు ‘కళ్లేడమ్మ.. కళ్లేడమ్మ.. గోగుల పిల్లకు.. కెచ్చెల పిల్లోడు’ అంటూ పెళ్లికి సంబంధించిన పాటలు పాడుతూ లయ బద్ధంగా డోలు వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఇప్పటికీ గిరిపల్లెల్లో పండుగలు, శుభ కార్యాల్లో ఆదివాసీ గిరిజన సంప్రదాయ డోలు, కొమ్ముల నృత్యాలు కనిపిస్తూనే ఉన్నాయి.  

సొంతంగా వాయిద్య పరికరాల తయారీ  
కొండరెడ్డి గిరిజనులు వాయిద్య పరికరా లు సొంతంగా తయారు చేసుకుంటారు. అడవిలో లభించే ఉస్కటేకు, వేగెసా చెట్ల తో డప్పుల నమూనాలను తయారు చేసి వాటికి మేక చర్మాలను అతికించి వాయి ద్య పరికరాలను తయారు చేసుకుంటారు. అలాగే అడ్డతీగ గిల్లలతో గుత్తులు కట్టి డప్పు వాయిద్యాల నడుమ ఆ గిల్లలు ఊపుతూ చక్కటి తాళంతో మహిళలు నృత్యం చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా గ్రామాల్లో పండగ సమయాల్లో నృత్యాలు చేస్తారు. బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగ నాడు వీరి ఆటపాటలతో కొండలు ప్రతిధ్వనిస్తుంటాయి. 

పోడు వ్యవసాయమే జీవనాధారం 
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సుమారు 11వేల మంది కొండరెడ్డి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునే వీరు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కొండ దిగి బయట ప్రపంచం వైపు రారు. ఆయా గ్రామాల్లో అందరూ కలిసి కట్టుగా ఉంటూ అన్ని శుభకార్యాలను వారి సంప్రదాయంలో ఎంతో వైభవంగా చేసుకుంటారు. 

పూర్వికుల నుంచి వస్తున్న సంప్రదాయం 
మా పూర్వీకుల నుంచి గ్రామాల్లో శుభకార్యాలకు డో­లు కొయ్య నృత్యాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్నే మేం కొనసాగిస్తున్నాం. సమాజంలోని మార్పుల వల్ల ఎన్ని కొత్త రకాల వాయిద్యాలు వచ్చినా మా డోలు కొయ్యి వాయిద్యమే మాకు వినసొంపుగా ఉంటుంది. అందులోనే మాకు సంతోషం ఉంటుంది. మాకు ప్రకృతి నేరి్పన సంగీతమిది.   – బొల్లి విశ్వనాథరెడ్డి 

ఆ నృత్యాల్లో అందరం మైమరచిపోతాం  
మా గిరిజన గ్రా­మా­­­ల్లో ఏటా వేసవిలో బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మేం తయారు చేసుకొన్న వాయిద్య పరికరాలు వాయిస్తూ లయబద్ధంగా నృత్యాలు చేస్తాం. ఆ సమయంలో చిన్నాపెద్ద తేడా ఉండదు. అందరూ కలసి సంతోషంగా ఆనందంగా నృత్యాలు చేస్తాం. ఇది మా పూర్వికుల నుంచి వస్తున్న ఆచారం.  – గోగుల గంగరాజు రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement