ఊరటనివ్వని టమాట!

Tomato prices drop to Rs 10 per kg In Annamayya District - Sakshi

దిగుబడి పెరిగింది..ధర తగ్గింది 

సత్యసాయి, అనంతపురం, కర్ణాటకల్లో దిగుబడులు మొదలు

అనంతపురంలో నెలముందే తెరచుకున్న మార్కెట్లు  

ఫలితంగా టమాట ధరలపై ప్రభావం  

గురువారం కిలో రూ.5 నుంచి రూ.10

ఒక్క మదనపల్లె మార్కెట్‌కే 1,269 టన్నుల టమాట రాక

ఏడు రాష్ట్రాలకు టమాట ఎగుమతులతో కొంత ఊరట

బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లాలోని దక్షిణ ప్రాంతం టమాట సాగుకు పెట్టింది పేరు. దేశంలోనే అత్యధిక టమాట సాగు చేసే ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు టమాట ఎగుమతులు అవుతాయి. జిల్లాలో అత్యధికంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో సాగవుతుంది. ఈ నియోజకవర్గంలో 9,044 హెక్టార్లలో,  పీలేరు నియోజకవర్గంలో 4,117 హెక్టార్లలో, మదనపల్లె నియోజకవర్గంలో 3,240 హెక్టార్లలో టమాట సాగవుతోంది.

ఈ మూడు నియోజకవర్గాల్లో 41,002 ఎకరాల్లో టమాట ఏడాది పొడవునా సాగులో ఉంటుంది. ఈ నేపథ్యంలో టమాట దిగుబడి భారీగా పెరిగి, ధరలపై ప్రభావం చూపుతోంది. దీనికితోడు సరిహద్దు కర్ణాటకలోని శ్రీనివాసపురం, చింతామణి, కోలారు, ముళబాగిలు, బాగేపల్లె నియోజకవర్గాల్లో టమాట దిగుబడులు మొదలు కావడంతో జిల్లా టమాట ధరలపై ప్రభావం చూపుతోంది. మదనపల్లె, ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ, కలికిరి టమాట మార్కెట్లలోనూ ధరల తగ్గుదల నెలకొంది. మదనపల్లె మార్కెట్‌లో గురువారం కిలో టమాట మొదటి రకం రూ.8.40–10, రెండో రకం రూ.5.00–8.20 మధ్యన పలికింది.

దిగుబడి ప్రభావమే
మూడు నియోజకవర్గాల్లో పెరిగిన టమాటకు అదనంగా అనంతపురం జిల్లా, కర్ణాటకలో దిగుబడులు మొదలయ్యాయి. దీనితో టమాట పంట రెండువైపులా విక్రయానికి వస్తోంది. అలాగే అనంతపురం జిల్లాలో టమాట మార్కెట్లు ఆగస్టు 15 తర్వాత ప్రారంభమవుతాయి. ఈసారి జూలై మొదటి వారంలోనే మార్కెట్లు ప్రారంభమై, విక్రయాలు సాగుతున్నాయి. ట్రేడర్లు ఇక్కడికి కూడా వెళ్లి టమాట కొంటున్నారు. దిగుబడి పెరగడం, ఇతర చోట్ల మార్కెట్లు ప్రారంభం వల్ల ధరలు తగ్గాయి.

ఏడు రాష్ట్రాలకు ఎగుమతులు
మదనపల్లె టమాట మార్కెట్‌ నుంచి గురువారం ఏడు రాష్ట్రాలకు టమాట ఎగుమతి అయ్యింది. ఒక్కరోజే 1,269 మెట్రిక్‌ టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. ఈ టమాటలో 60శాతం తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, వరంగల్, మహరాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్, జగదల్‌పూర్, విహిల్, అంబికాపూర్, బవోదాబాద్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, జబల్‌పూర్,  పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, గుజరాత్‌లోని జోధ్‌పూర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్, దేశ రాజధాని ఢిల్లీకి ఎగుమతి అయ్యింది. 40శాతం టమాట రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కాకినాడ, తుని, నర్సీపట్నం, అనకాపల్లె, కంచిలి, ఏలూరులకు ఎగుమతి అయ్యింది.

అమావాస్య ప్రభావం కూడా 
గురువారం అమావాస్య కావడంతో తెలంగాణ మార్కెట్లు మూతబడ్డాయి. ఇదికూడా ధర తగ్గడానికి కొంత కారణం అయినప్పటికీ ఇప్పడు వస్తున్న దిగుబడిలో నాణ్యత తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. దీనివల్ల ధరలు కొంతమేర తగ్గుతున్నట్టు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో వచ్చేనెలలో మార్కెట్లు ప్రారంభమై ఉంటే ధరలు కొంత పెరిగి ఉండేవని కూడా అంటున్నారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు టమాట ఎగుమతులు ఉన్నందునే ఈ ధరైనా పలుకుతోందని, లేదంటే ధరలు పతనమయ్యే పరిస్థితి వచ్చేదని అంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top