పొగాకు రైతులపై ఎందుకీ పగ? | Tobacco Farmers Protest In Sri Potti Sriramulu Nellore District | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులపై ఎందుకీ పగ?

May 17 2026 5:35 AM | Updated on May 17 2026 5:35 AM

Tobacco Farmers Protest In Sri Potti Sriramulu Nellore District

పొదిలిలో పొగాకు రైతుల ఆందోళన

డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో రైతుల ధర్నా 

ఆందోళనల్ని ఉధృతం చేస్తామని 

మాజీ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరిక

మర్రిపాడు/పొదిలి/ఒంగోలు సబర్బన్‌: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో రైతులు శనివారం ధర్నాకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వేలాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వేలం ప్రారంభ సమయంలో కిలో ధర రూ.250 వరకు పలికిన ధర, ఆపై రూ.235లో కొనసాగుతోందన్నారు. దీనివల్ల ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం వస్తోందన్నారు.

బోర్డు అనుమతి మేరకు తీసుకొచ్చిన పొగాకును కూడా బయ్యర్లు పూర్తిగా కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. దీంతో రవాణా ఖర్చులు, గోడౌన్‌ ఖర్చులు అదనంగా భారం అవుతున్నాయని వాపోయారు. సమాచారం అందుకున్న వేలం నిర్వహణాధికారి సునీల్‌ రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. బయ్యర్లతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.   

పొదిలిలో వేలం నిలిపివేత 
మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రంలో శనివారం పొగాకు వేలం నిలిచిపోయింది.  నష్టం కలిగిస్తున్న వేలం అవసరం లేదంటూ వేలాన్ని రైతులు అడ్డుకున్నారు. కేజీకి గరిష్టంగా రూ.230, కనిష్టం రూ.195 మాత్రమే పలకడంతో గిట్టుబాటు ధరలు లేవని రైతులు తెలిపారు. 

పోరాటం ఉధృతం చేస్తాం 
పొగాకుకు గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు–2 వేలం కేంద్రాన్ని ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, పార్టీ నేతలతో కలిసి శనివారం సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి వ్యాపారుల మధ్య పోటీ పెంచారని గుర్తు చేశారు. రూ.300 కోట్లు వెచ్చించి పొగాకు రైతులను లాభాల బాట పట్టించారని చెప్పారు. పొగాకు ధరలు ఇదేవిధంగా కొనసాగితే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement