
ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
అన్నమయ్య జిల్లాలో విషాదం
మదనపల్లె సిటీ/ములకలచెరువు: ఆర్టీసీ బస్సు మోటార్‌బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన విషాద ఘటన ఇది. వీరు ముగ్గురు చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలు. అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం, వేపూరికోట పంచాయతీ, పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వేపూరికోట పంచాయతీ కూటగుళ్లోపల్లికి చెందిన వేమనారాయణ, శ్యామల కుమారుడు కె.తరుణ్ (24), చంద్రప్ప, నాగరత్నమ్మల కుమారుడు కె.వెంకటేష్ (20), ఓబులేసు, కవితమ్మల కుమారుడు కె.మనోజ్ (19) మోటార్‌బైక్‌పై ములకలచెరువుకు బయలుదేరారు.
ఆ ఊరిలో ఉండే వెంకటేష్ మిత్రుడు స్నేహితుల దినోత్సవం కేక్ కట్ చేసుకుందామని పిలవడంతో ములకలచెరువు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో పెద్దపాలెం ఫ్లైవర్ వద్ద ములకలచెరువు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తరుణ్ బెంగుళూరులో సిగ్విలో డెలివరీ బాయ్‌గా, వెంకటేష్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు.
మనోజ్ కాలేజీలో చదువుకుంటున్నాడు. వీరు బెంగళూరులో రూము అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ముగ్గురు అవివాహితులు. స్వగ్రామానికి శనివారం వచ్చారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ములకలచెరువు ఎస్.ఐ నరసింహుడు, సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కూటగుల్లోపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.