
సొంత ఆస్తులు విక్రయించి, అప్పు చేసి పరిశ్రమ ఏర్పాటు
ప్రభుత్వ సాయం అందక వడ్డీలు పెరిగిపోయిన వైనం
చావే శరణ్యం అంటూ వాపోయిన కాంక్రీట్ పరిశ్రమ
రాయచోటి: ఆర్థిక సమస్యలతో చితికిపోయిన ఓ చిన్న పరిశ్రమ యజమాని కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆదివారం పంపిన మరణ సందేశం కలకలం రేపింది. బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక చేదోడు పథకంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని దూల్లవారిపల్లి వద్ద రెడీమిక్స్ కాంక్రీట్ పరిశ్రమను శ్రీనివాసులు ఏర్పాటు చేసుకున్నారు. సొంత ఆస్తులు విక్రయించడంతోపాటు రూ.60 లక్షలు అప్పులు చేసి పరిశ్రమను నెలకొల్పిన ఆయన.. ప్రభుత్వం, బ్యాంకు నుంచి దాదాపు రూ.80 లక్షల మేర ఆరి్థక సాయం కోసం ఎదురు చూసి విసిగిపోయారు.
అప్పులపై వడ్డీల భారం పెరిగిపోవడంతో ఆరి్థకంగా చితికిపోయాడు. ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిన సందేశంలో పేర్కొన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, అర్బన్ సీఐ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు రెడీమిక్స్ పరిశ్రమ యజమాని మర్రిపాటి శ్రీనివాసులును ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు కౌన్సెలింగ్ అనంతరం సంతకాలు తీసుకుని సోమవారం సాయంత్రం విడుదల చేశారు.