హైదరాబాద్: ఇటీవల బెంగళూరు హైవేపై జరిగిన కర్నూలు బస్సు విషాదం మరువకముందే, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఈరోజు (సోమవారం) మరో ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని హైవేలపై ప్రతిరోజూ సగటున 15 మంది ‘అతివేగం’ కారణంగా మరణిస్తున్నారు. 2023లో రెండు రాష్ట్రాలలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతివేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాద మరణాలలో 30 శాతం మరణాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయి.
తెలంగాణలో 2020- 2023 మధ్య కాలంలో 25 వేల మందికి పైగా జనం అతివేగం కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశారు. అతివేగం వల్ల సంభవించే మరణాల విషయానికి వస్తే, దేశంలోనే తెలంగాణ ఏడవ స్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా తదితర పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉంది. రోడ్డు ప్రమాదాలలో 80 శాతానికి మించిన ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు.
వాహనాలు నడిపే విషయంలో స్పష్టమైన వేగ పరిమితులను నిర్ణయించాలని, రోడ్లపై కనిపించే విధంగా సంకేతాలను ఏర్పాటు చేయాలని నిపుణులు కోరుతున్నారు. చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా మలుపులు, జంక్షన్ల వద్ద సరైన సూచికలు లేవని వారు అంటున్నారు. స్పీడ్ లేజర్ గన్‌లు తాత్కాలిక నిరోధకం మాత్రమేనని, మెరుగైన రోడ్డు డిజైన్, సరైన గుర్తులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి


