ఏపీ పరిశ్రమల్లో జపాన్‌ సాంకేతికత 

TERI Director Girish Sethi Says Japan Intrest Providing Technology AP Industries - Sakshi

అందించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు టెరి డైరెక్టర్‌ వెల్లడి  

రాష్ట్రంలో 6 ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లలో ఇంధన సామర్థ్యంపై అధ్యయనం 

ఇంధన సామర్థ్య సాంకేతికతల అమలుకు అపార అవకాశాలు  

ఏపీని దేశానికే రోల్‌మోడల్‌గా నిలుపుతామన్న గిరీశ్‌ సేథి  

సాక్షి, అమరావతి: ఇంధన పొదుపులో ఏపీ పరిశ్రమలకి సాంకేతికతను అందించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు జపాన్‌కు చెందిన ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీఈఆర్‌ఐ – టెరి) డైరెక్టర్‌ గిరీశ్‌ సేథి చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా–జపాన్‌ ఎన్విరాన్‌మెంట్‌ వీక్‌’ సదస్సులో భా­గంగా దేశంలో పర్యావరణ మౌలిక సదుపాయాలు, సాంకేతికతల ద్వారా రెసిలెంట్‌ డీ కార్బనైజ్డ్‌ సొసై­టీ నిర్మాణం అనే అంశంపై టీఈఆర్‌ఐ ఈ నెల 12, 13 తేదీల్లో సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా గిరీశ్‌ సేథి మాట్లాడుతూ జపాన్‌–ఇండియా టెక్నాలజీ మ్యాచ్‌ మేకింగ్‌ (జేఐటీఎం)లో భాగంగా ఇంధన సామర్థ్య సాంకేతికతల్లోను ఏపీని దేశానికే రోల్‌మోడల్‌గా నిలుపుతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బ్యూ­రో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఇతర శాఖ­లతో సంప్రదింపులు జరిపి అవసరమైన అనుమతులు తీసుకున్న అనంతరం, జపాన్‌ ప్రభుత్వ సహకారంతో ఏపీలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) లో–కార్బన్‌ సాంకేతికతలను పరిచయం చేస్తామని చెప్పారు.

ఏపీ పరిశ్రమల విభాగంలో ఇంధన వినియోగం దాదాపు 18,844 మిలియన్‌ యూనిట్లు (ఏపీఈఆర్‌సీ టా­రిఫ్‌ ఆర్డర్‌ 2022–23 ప్రకారం) ఉండగా, ఇందులో డిస్కంల డేటా ప్రకారం ఎంఎస్‌ఎంఈలు ఏటా 5 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయని తెలిపారు. దీన్లో 10 శాతం విద్యుత్తును ఆదాచేసినా, ఏడాదికి రూ.300 కోట్ల విలువైన 500 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుందని చెప్పారు. ఏపీలోని ఫిషరీస్, రిఫ్రాక్టరీ, ఫౌండ్రీ, స్పిన్నింగ్, దాల్‌ ప్రాసెసింగ్, కోల్డ్‌ స్టోరేజీ వంటి ఆరు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లలో తమ సంస్థ ఇంధన సామర్థ్య అధ్యయనం చేసిందని తెలిపారు.

భీమవరంలోని సీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో సుమారు 65 మిలియన్‌ యూనిట్లు, ఫౌండ్రీ క్లస్టర్‌లో 12 మిలి­యన్‌ యూనిట్లు, తూర్పుగోదావరిలోని రిఫ్రాక్టరీ క్లస్టర్‌లో 2,400 మెట్రిక్‌ టన్నుల బొగ్గుకు సమానమైన థర్మల్‌ ఇంధనాన్ని ఆదాచేయవచ్చని అంచనా వేశామని వివరించారు. ఈ మూడు క్లస్టర్లలోనే ఏటా 65 వేల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 30 స్టేట్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీలు (ఎస్డీఏలు) పాల్గొన్న ఈ సదస్సులో మన రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం)కు మాత్రమే ప్రసంగించే అవకాశం లభించింది.

రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకు ఎనర్జీ ఎఫిషియెన్సీ ద్వారా చేకూరే ప్రయోజనాలపై టెరి తయారుచేసిన నివేదికను జపాన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ వ్యూహాలసంస్థ (ఐజీఈఎస్‌) డైరెక్టర్‌ సతోషి కోజిమా, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణమార్పుశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి రజనీరంజన్‌ రష్మీ ఆవిష్కరించి ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డికి అందజేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top