మన్యంలో చలి విజృంభణ

సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చలి గాలులు అధికమయ్యాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు వద్ద 9.8 డిగ్రీలు నెలకొనగా గురువారం ఉదయం 6.8 డిగ్రీలకు పడిపోవడంతో చలి అధికమైంది. ఒక్కరోజు వ్యవధిలోనే 3 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గడంతో అరకు ప్రాంత వాసులు చలితో ఇబ్బందులు పడుతున్నారు.
పొగ మంచు దట్టంగా కురవడంతో పాటు చలి పెరగడంతో స్థానికులు, పర్యాటకులు అవస్థలు పడ్డారు. ఉదయం 10 గంటల వరకు మంచు కమ్ముకుంది. అలాగే పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో కూడా పొగ మంచు దట్టంగానే కురిసింది.