‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్‌’ | TDP MLA Bendalam Ashok lashes out at tribals | Sakshi
Sakshi News home page

‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్‌’

Mar 27 2026 4:16 AM | Updated on Mar 27 2026 4:16 AM

TDP MLA Bendalam Ashok lashes out at tribals

ఎమ్మెల్యే అశోక్‌తో చర్చిస్తున్న గిరిజన నేతలు

తీవ్ర అసభ్య పదజాలంతో గిరిజనులపై విరుచుకుపడిన టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ 

ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యేకు సమస్యను విన్నవించేందుకు వచ్చిన గిరిజన నేతలు

సమస్యపై ప్రశ్నించడంతో గిరిజనులపై ఎమ్మెల్యే అశోక్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు

కంచిలి/కవిటి: గిరిజనులపై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంతొరియా కులానికి ఎస్టీ సర్టిఫికెట్‌ అంశంపై ఎమ్మెల్యే అశోక్‌ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడం, అందుకు సంబంధించి తీసుకుంటున్న చొరవపై నిజమైన ఎస్టీ కులాలకు నష్టం జరుగుతోందని ఇటీవల గిరిజన సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. స్పందించకపోతే ఎమ్మెల్యే అశోక్‌ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అశోక్‌తో గిరిజన సంఘ ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ వర్గం(గిరిజనులు) 5గురు, బెంతొరియా కులం నుంచి 5గురితో కలిసి కలెక్టర్‌ ఆధ్వర్యంలో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. ఈ సమయంలో కంచిలి మండలానికి చెందిన భగవాన్‌ దొళాయి అనే గిరిజన యువకుడు ఎమ్మెల్యే అశోక్‌ను ఉద్దేశించి.. ‘‘మీరు అసెంబ్లీలో మాట్లాడక ముందు ఇలా రెండు వర్గాలను కూర్చొబెట్టి చర్చించాలని తెలియదా..! అని అభ్యంతరం వ్యక్తం చేశాడు. వెంటనే ఎమ్మెల్యే అశోక్‌ ఆ యువకుడి మీద అమాంతం విరుచుకుపడ్డారు. 

‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్‌’ అంటూ ఆవేశంతో విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. గిరిజన నేతలు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పినప్పటికీ ఆయన శాంతించ లేదు. అనంతరం వారు ఎమ్మెల్యేకి, స్థానిక తహసీల్దార్‌ కృష్ణమూర్తికి వినతిపత్రాలు అందించి వెళ్లిపోయారు.  

ఎమ్మెల్యే తీరుపై గిరిజన సంఘాల అసహనం  
ఎమ్మెల్యే అశోక్‌ దగ్గరకు మాట్లాడేందుకు వెళ్లిన గిరిజన సంఘాల నేతలు అడిగిన ప్రశ్నకు తీవ్ర పదజాలంతో స్పందించడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన యువకుడు అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోవడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం తగదని గిరిజన సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఏపీ రాష్ట్ర ఏఐఏఈఎఫ్‌ ఉపాధ్యక్షుడు సవర జగన్నాయకులు, పలాస మండలానికి చెందిన ఆదివాసీ సంఘాల జేఏసీ సభ్యులు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement