
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడిపై టీడీపీ నేతల ఆగ్రహం
కలెక్టరేట్ ఎదుట తలపై హుండీతో ధర్నా
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లాలోని నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్నాయుడు ధోరణి పట్ల ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. తమ ప్రాంతంలో నిర్మిస్తున్న వినాయకస్వామి ఆలయ నిర్మాణాన్ని ఆపే హక్కు ఎవరిచ్చారని టీడీపీ సీనియర్ నాయకుడు రామానుజం చలపతి ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆలయ హుండీ, చంద్రబాబునాయుడు చిత్రపటాలను చేతిలో పెట్టుకుని ధర్నా చేశారు.
ఈ సందర్భంగా చలపతి మాట్లాడుతూ తమ ప్రాంతంలో నిర్మిస్తున్న వినాయకస్వామి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో గాలి భానుప్రకాష్ నాయుడు పాత్ర ఉందని విమర్శించారు. నగరిపేటలో కొత్తగా ఏర్పాటైన కాలనీలో గతంలో వినాయక స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టామని, అయితే ఆర్థిక కారణాలతో పనులు ఆగాయని, కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి రావడంతో నగరిపేట ప్రాంత వాసులు కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకుని తాజాగా ఆలయ పనులు ప్రారంభించారని, అయితే ఈ గుడి నిర్మాణం నిలిపివేయాలంటూ నలుగురు ఫిర్యాదు చేశారని, దీంతో నగరి తహసీల్దార్ పనులను అడ్డుకున్నారని వివరించారు.
దీనివెనుక ఇద్దరు టీడీపీ నేతలు ఉన్నట్టు తెలిసిందని, ఆ ఇద్దరి వెనుక నగరి ఎమ్మెల్యే హస్తముందని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని గుడి నిర్మాణానికి ఆటంకాలు తొలగించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో నగరి మున్సిపాలిటీ మహిళా మాజీ కౌన్సిలర్ లత, ఇతర మహిళా నాయకులు పాల్గొన్నారు.