నీ కొడుకు మా పిల్లని ప్రేమిస్తాడా? | Tribal Woman Alleges Brutal Assault Over Interfaith Love Issue In Nellore, Claims Political Involvement | Sakshi
Sakshi News home page

నీ కొడుకు మా పిల్లని ప్రేమిస్తాడా?

Jun 29 2026 8:48 AM | Updated on Jun 29 2026 10:52 AM

TDP Leader Overaction Tribal Woman

AI ఫోటో

వివస్త్రను చేసి, ఈడ్చిఈడ్చి, దారుణంగా కొట్టారు 

శరీరానికి చేతులు అడ్డుపెట్టుకొని ఇంట్లోకి పరుగెత్తా  

టీడీపీ నేతల పైశాచిక దాడిని వెల్లడించిన బాధిత గిరిజన మహిళ 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నా కొడుకు మా ప్రాంతానికి చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడని తెలిసి మందలించాను. వాళ్లకు తెలియజేసి అమ్మా యిని కట్టడి చేయమని నేనే చెప్పాను. అయితే మాజీ కౌన్సిలర్‌ ఇబ్రహీం, షర్మిళ, సిరాజ్, కమల్, బీబ్జాన్, మల్లిక ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటలకు నన్ను ఇంట్లో నుంచి జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి.. దుస్తులు చించేసి వివస్త్రను చేసి ఈడ్చి ఈడ్చి కాళ్లతో, చేతులతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. కొట్టొద్దని కాళ్లు పట్టుకున్నా.. కనికరించలేదు. వారి నుంచి తప్పించుకుని శరీరానికి  చేతులు అడ్డుపెట్టుకుని ఇంట్లోకి పరుగెత్తాను. 

నేను ఏం తప్పు చేస్తే ఇలా కొట్టారు’ అంటూ కావలికి చెందిన గిరిజన మహిళ బోరున విలపించింది. ఆమె తనకు జరిగిన అవమానాన్ని ఆదివారం మీడియాకు వివరించింది. ‘నేను గిరిజన మహిళను. నా భర్త ముస్లిం. ఆయన 8 ఏళ్ల క్రితం చనిపోవడంతో ఇద్దరు బిడ్డలతో చిన్న దుకాణం పెట్టుకుని బతుకుతున్నా. పిల్లలు తెలిసో తెలియకో ప్రేమించుకున్నారు. పెద్దలుగా వారిని మందలించి సరైన మార్గంలో పెట్టాలి. టీడీపీ స్థానిక లీడర్, మాజీ కౌన్సిలర్‌ ఇబ్రహీం పెద్ద మనిషిగా సమస్యను పరిష్కరించకపోగా తన వాళ్లతో కలిసి నాపై దాడికి పాల్పడ్డారు. ఎరుకుల దానివి. నీ కొడుకు మా పిల్లని ప్రేమిస్తాడా? మిమ్మల్ని బతకనివ్వం అంటూ నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి విచక్షణారహితంగా కొట్టారు. 

అధికారం మాది.. కేసులు మమ్మల్ని ఏం చేస్తాయి? చంపేసి సూసైడ్‌ అని రాయిస్తా. నీకు దిక్కెవరు. నీ కొడుకులపై కేసులు పెట్టి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తా... ఎరుకుల లం.. అంటూ తీవ్రంగా కొట్టారు. ఇదంతా చుట్టు పక్కల జనాలంతా చూశారు.  కొద్ది సేపటికి రెండో పట్టణ సీఐ, ఎస్సైలు వచ్చి నన్ను, స్థానికులను విచారించారు. నేను కూడా టీడీపీ సానుభూతి­పరురాలినే. నన్ను కొట్టిన వాళ్లు టీడీపీ మాజీ కౌన్సిలర్‌ కావడంతో కేసు నమోదు చేయలేదు. ఈ విషయం ఎక్కడైనా బయటకు వస్తే చంపేస్తామంటూ బెదిరించారు. నేను వాళ్లతో రాజీ పడేందుకు నా కొడుకుపైన అక్రమంగా కేసు పెట్టారు. ఇది ఎంత వరకు న్యాయం’ అని ఆమె ప్రశ్నించారు.

ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: వైఎస్సార్‌సీపీ
గిరిజన మహిళపై జరిగిన అమానవీయ ఘటనపై వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం బాధిత మహిళ నివాసానికి వెళ్లి ఆమెను ఓదార్చారు. బాధితురాలికి న్యాయం కోసం ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయి స్తామని గిరిజన మహిళా నాయకురాలు చలంచ్ల పద్మమ్మ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నందనవనం సీతమ్మ, జిల్లా మహిళా కార్యదర్శి దామెర్ల నాగేశ్వరమ్మ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement