Andhra Pradesh: ఆ ఊరిలో.. ట్యాక్స్‌ ఫ్రీ

Tax Free In Golla gudem Gets Inspirational Village - Sakshi

గొల్లగూడెంలో మరో నాలుగేళ్లు ఇదే ఆఫర్‌

కుళాయి, ఇంటి పన్నులు సర్పంచ్‌

కుటుంబమే చెల్లిస్తుంది

ఊరి చెరువు చేపలూ ఉచితమే

ద్వారకాతిరుమల: ఆ ఊళ్లో కుళాయి పన్ను, ఇంటి పన్ను ఎవరూ కట్టక్కర్లేదు. ఆ గ్రామ పంచాయతీ చెరువులోని చేపలు కూడా గ్రామస్తులకు ఉచితమే. ఇప్పటికే ఓ ఏడాది పాటు అందివచ్చిన ఈ అద్భుతమైన ఆఫర్‌ మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలంపాలెం పంచాయతీలోని గొల్లగూడెం గ్రామం ఏడాది క్రితం నూతన పంచాయతీగా ఏర్పడింది. సుమారు 2 వేల జనాభా, 1,418 మంది ఓటర్లు ఉన్నారు.

గత ఏడాది జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రయత్నించారు. ఫలించకపోవడంతో చివరకు పోటీ అనివార్యమైంది. దీంతో శ్రీమంతుడిగా పేరున్న వైఎస్సార్‌ సీపీ నేత బొండాడ వెంకన్నబాబు తన తండ్రి నాగభూషణాన్ని పోటీకి దింపారు. ఆయనను గెలిపిస్తే ఐదేళ్ల పాటు పంచాయతీకి కుళాయి, ఇంటి పన్నులు ఎవరూ చెల్లించక్కర్లేదని హామీ ఇచ్చారు. దాంతో పాటు ప్రస్తుత బకాయిలను కూడా తానే చెల్లిస్తానన్నారు. చేపల పెంపకానికి వినియోగిస్తున్న మందులు, వ్యర్థాల కారణంగా గ్రామంలోని పంచాయతీ చెరువు దుర్వాసన వెదజల్లుతోందని.. తన తండ్రి సర్పంచ్‌ అయిన తరువాత చెరువులో ఎటువంటి మందులు, వ్యర్థాలు వేయకుండా చేపలు పెంచి ప్రజలకు ఉచితంగా ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో అప్పట్లో గొల్లగూడెంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.

గెలిచిన వెంటనే..
త్రిముఖ పోటీలో బొండాడ నాగభూషణం ప్రత్యర్థులపై 435 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఆ ఏడాది పన్నులతో పాటు, అప్పటి వరకూ ఉన్న పన్ను బకాయిల మొత్తం రూ.9.50 లక్షలు పంచాయతీకి చెల్లించారు. గ్రామంలోని చెరువును రూ.1.50 లక్షలకు బహిరంగ వేలం ద్వారా మూడేళ్ల కాల పరిమితికి దక్కించుకుని, అందులో సహజసిద్ధంగా చేపల పెంపకం చేపట్టారు. ఆ చేపలను ఈ ఏడాది ఫిబ్రవరి 17న గ్రామంలోని ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేశారు. సర్పంచ్‌ పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉండటంతో.. అప్పటి వరకూ ఈ ట్యాక్స్‌ ఫ్రీ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాదికి సంబంధించిన కుళాయి, ఇంటి పన్నుల సొమ్ము రూ.5.11 లక్షలను కొద్ది రోజుల క్రితమే పంచాయతీకి చెల్లించారు.

రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామం..
రాష్ట్రంలోనే తొలి ట్యాక్స్‌ ఫ్రీ గ్రామంగా గొల్లగూడెం నిలుస్తోంది. మిగిలిన గ్రామ పంచాయతీలకు ఈ గ్రామం ఆదర్శం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పంచాయతీ ట్యాక్స్‌లు ప్రజల తరఫున మేమే చెల్లిస్తున్నాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహాయ సహకారాలతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం.
– బొండాడ వెంకన్నబాబు, సర్పంచ్‌ కుమారుడు 

నూరు శాతం పన్ను వసూలైంది
గ్రామంలోని ప్రతి ఒక్కరి కుళా యి, ఇంటి పన్నులను సర్పంచ్‌ నాగభూషణం, ఆయన కుమారుడు వెంకన్నబాబు చెల్లిస్తున్నా రు. దీనివల్ల మా పంచాయతీలో నూరు శాతం పన్నులు వసూలవుతున్నాయి. ప న్ను వసూలు కోసం ఇంటింటిటీ తిరిగే బాధ తప్పింది.
– జక్కంపూడి రాజేష్, పంచాయతీ కార్యదర్శి 

దుర్గంధం బాధ తప్పింది 
గతంలో పంచాయతీ చెరువులో చేపల పెంపకం కోసం మందులు, వ్యర్థాలను వాడేవారు. దాంతో చెరువు తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లేది. అటుగా నడవలేకపోయేవాళ్లం. వెంకన్నబాబు, ఆయన తండ్రి నాగభూషణం దయవల్ల చెరువు బాగుపడింది.  
ఎర్ర దుర్గ, గ్రామస్తురాలు

పన్నుల భారం లేదు 
ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి వెంకన్నబాబు, ఆయన తండ్రి నాగభూషణం గ్రామంలోని సుమారు 700 గృహాలకు కుళాయి, ఇంటి పన్నులను చెల్లిస్తున్నారు. దీనివల్ల మాకు పన్నుల భారం తప్పింది. చాలా సంతోషంగా ఉంది. 
– కొడవలూరి పద్మావతి, గ్రామస్తురాలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top