అధరహో...సిరులు కురుపిస్తున్న చింత

Tamarind Is Pouring Into The Veins Of The Tribal Home - Sakshi

సాక్షి,పాడేరు: చింతపండు గిరిజనుల ఇంట సిరులు కురిపిస్తోంది. ఈ ఏడాది మంచి ధర లభించింది. ప్రైవేట్‌ వ్యాపారులు, జీసీసీ సిబ్బంది పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని పాడేరు డివిజన్‌లో  11 మండలాలు, రంపచోడవరం డివిజన్‌ పరిధిలో  మారెడుమిల్లి ప్రాంతంలో  వ్యాపారం జోరుగా సాగుతోంది.  వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో చింతపండు దిగుబడి ఆశాజనకంగా  ఉంది. గిరిజన ప్రాంతాల్లోని  చింతపండుకు  మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్‌ ఉంది.

జీసీసీ సిబ్బంది, ప్రైవేట్‌ వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నారు. దిగుబడి చివరిదశకు చేరుకోవడంతో కొనుగోలులో పోటీ నెలకొంది. గిరిజన సహకార సంస్థ  ఈ ఏడాది కిలో రూ.32.40  మద్దతు ధరతో భారీగా కొనుగోలు చేస్తోంది. గత ఏడాది చింతపల్లి, పాడేరు డివిజన్ల పరిధిలో సుమారు 120 టన్నుల వరకు జీసీసీ కొనుగోలు చేసింది. మార్చి నెల సీజన్‌ ప్రారంభంలో కిలో రూ.25 నుంచి రూ.30 వరకు వ్యాపారులు కొనుగోలు చేయగా, జీసీసీ రూ.32.40కు  కొనుగోలు చేసింది.  మార్కెట్‌లో పోటీగా ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు కూడా ధరను పెంచారు. ప్రస్తుతం ప్రైవేట్‌ వ్యాపారులు చింతపండు నాణ్యతను బట్టి కిలో రూ.35 నుంచి రూ.40 వరకు కొనుగోలు చేస్తున్నారు.అయితే తూకంలో మాత్రం తేడాలు ఉండడంతో మోసపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు. 

సంతల్లో విక్రయాలు 
పలువురు గిరిజనులు తాము సేకరించిన చింతపండును సంతల్లో విక్రయిస్తున్నారు. దేవరాపల్లి, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు సంతల్లో చింతపండును భారీగా విక్రయించారు.  ప్రైవేటు వ్యాపారులు,స్థానిక ప్రజలు  15 కిలోల బరువు తూగే చింతపండు బుట్టను రూ.500  నుంచి రూ.500 వరకు కొనుగోలు చేశారు.  

భారీగా  కొనుగోలు
గిరిజన సహకార సంస్థ అన్ని వారపుసంతల్లో  చింతపండును భారీగా  కొనుగోలు చేస్తోంది. గత ఏడాది కొనుగోలు చేసిన చింతపండు నిల్వలు కోల్డ్‌ స్టోరేజీలో ఉన్నప్పటికీ ఈ ఏడాది గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. పాడేరు డివిజన్‌లో 230 క్వింటాళ్లు, చింతపల్లిలో 100 క్వింటాళ్లు కొనుగోలు చేశాం. ఈ నెలలో లక్ష్యం మేరకు   చింతపండును   కొనుగోలు చేస్తాం. గిరిజనులంతా జీసీసీ సంస్థకు సహకరించాలి.  

– కురుసా పార్వతమ్మ, జీసీసీ డీఎం,పాడేరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top