గిరిజనులకు సేవచేస్తే దేవుణ్ణి పూజించినట్లే | Sakshi
Sakshi News home page

గిరిజనులకు సేవచేస్తే దేవుణ్ణి పూజించినట్లే

Published Mon, Dec 26 2022 6:20 AM

Swaroopanandendra Saraswati Comments On Tribals - Sakshi

అరకులోయ రూరల్‌ (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సింహాచలం: గిరిజనులకు సేవ చేయడం భగవంతుని ఆరాధించడంతో సమానమని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. అరకులోయలోని ఎన్టీఆర్‌ మైదా­నం­లో గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆది­వారం శంకరాచార్య గిరి సందర్శన మహోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామీజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణతో కలిసి ఉచిత మెగా వైద్యశిబిరం ప్రారంభించారు. 500 మంది పేద వృద్ధులకు దుప్పట్లు, 500మంది భక్తులకు భగవద్గీత గ్రంథాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు కల్మషం లేనివారని, వారికి సేవచేయాలని ఉద్బోధించారు. అందరూ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో భగవంతుని కొలుస్తారు కానీ ఇక్కడ గిరిజన ప్రజలు ప్రకృతిని, చెట్లను దైవంగా ఆరాధిస్తారన్నారు. ఆంజనేయస్వామి గిరిజనుడే అని, అడవి బిడ్డలంతా అంజనీపుత్రుని వారసులేనని తెలిపారు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మతమార్పిడులు చేస్తున్నారని, వారిని కట్టడి చేసేందుకే క్రిస్మస్‌ రోజున భగవద్గీతలను పంపిణీ చేశామన్నారు. గిరిజన ప్రాంతంలో దేవాలయల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామన్నారు.

పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో పేద విద్యార్థుల­కు విద్య అందించేందుకు త్వరలోనే పాఠశాలలు ఏర్పాటుచేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాలు ఏర్పడటం ఆనందంగా ఉందని, ఏపీలో మాత్రమే ఇలా గిరిజనులకు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటయ్యా­యని స్వామీజీ అన్నారు. చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ప్రజలను దైవ మార్గంలో నడిపించేందుకు కృషిచేయడంతోపాటు విద్య, వైద్య రంగాల్లో సేవలందిస్తున్న విశాఖ శారద పీఠానికి రుణపడి ఉంటామన్నారు. గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి జగదీష్‌బాబు, ఎంపీపీ ఉషారాణి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement