జేఎన్‌టీయూఏలో ర్యాగింగ్‌ వికృతరూపం 

Suspension on 12 students for Raging at JNTUA - Sakshi

 12 మంది విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు 

అనంతపురం విద్య:  జేఎన్‌టీయూ (అనంతపురం) ఇంజనీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్‌ రక్కసి వికృతరూపం దాల్చింది. సీనియర్‌ విద్యార్థులు అర్ధరాత్రి దాకా వెకిలిచేష్టలు.. అలసిపోయేదాకా డ్యాన్సులు.. అడ్డూఅదుపూలేని అకృత్యాలకు పాల్పడటంతో జూనియర్‌ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వీరి ఆగడాలు మితిమీరుతుండటంతో భరించలేకపోయిన బాధితులు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది కెమికల్, కంప్యూటర్‌ సైన్సెస్‌ గ్రూప్‌ సెకండియర్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేస్తూ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సుజాత శనివారం ఉత్తర్వులిచ్చారు.

జేఎన్‌టీయూ(ఏ) చరిత్రలో ఒకేసారి 12 మంది విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటుపడటం ఇదే తొలిసారి. సీనియర్, జూనియర్‌ విద్యార్థుల హాస్టళ్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ ర్యాగింగ్‌ పేరిట వికృత క్రీడ సాగిస్తున్నారు. జూనియర్లను సీనియర్‌ విద్యార్థుల హాస్టల్‌కు రప్పించి అర్ధరాత్రి దాకా అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడంతో పాటు సిగరెట్లు, మద్యం తీసుకొచ్చి ఇవ్వాలని పురమాయిస్తున్నారు. గంటల తరబడి నిల్చునే ఉండాలని కోరడంతో పాటు సీనియర్లు చెప్పింది వినాలంటూ ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం 
ర్యాగింగ్‌ జరిగినట్లు తెలియగానే శుక్రవారం రాత్రి హాస్టల్‌కు వెళ్లి ఆరా తీశాం. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉండి విద్యార్థులతో మాట్లాడాం. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు. ర్యాగింగ్‌కు పాల్పడితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. 
– ప్రొఫెసర్‌ పి.సుజాత, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూఏ ఇంజనీరింగ్‌ కళాశాల   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top