నిందితుడు ఆవుల వెంకటేశ్ (ఫైల్)
ఇంటిలోనే గొంతు కోసి ఘాతుకం
వైఎస్సార్ కడప జిల్లాలో దారుణం
ఆగ్రహోదగ్రులైన మృతురాలి బంధువులు
జాతీయ రహదారిపై రాస్తారోకో
లాఠీచార్జ్‌కు పోలీసుల యత్నం
తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసుల కాళ్లపై పడి బంధువుల వేడుకోలు
నిందితుడిని ఉరి తీయాలన్న మృతురాలి తల్లిదండ్రులు
ఖాజీపేట: ప్రేమోన్మాది చేతిలో ఓ బాలిక దారుణహత్యకు గురైంది. ఈ దుర్ఘటన వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలో శుక్రవారం జరిగింది. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె రామకీర్తన (16) ఉన్నారు. కీర్తన ఖాజీపేటలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివి ఇటీవలే పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటుంది.
శుక్రవారం ఉదయం కీర్తన తండ్రి శ్రీనివాసులు తన పెద్ద కుమారునితో కలిసి మైదుకూరుకు జీవాల కొనుగోలుకు వెళ్లాడు. తల్లి నాగమణి కూలి పనులకు వెళ్లారు. కీర్తన తమ్ముడు బడికి వెళ్లాడు. దీంతో కీర్తన ఒంటరిగా ఇంటి వద్ద ఉండడంతో ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ వచ్చి కొడవలితో గొంతుకోసి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి, అతడి పెద్దకుమారుడు రక్తపుమడుగులో పడి ఉన్న రామకీర్తనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.
అప్పటికి రామకీర్తన మాట్లాడు తుండడంతో విషయం తెలుసుకుని పోలీసు లకు సమాచారం ఇచ్చారు. కీర్తన గొంతు నుంచి రక్తస్రావం జరగకుండా టవల్‌ను చుట్టి ఆమెను చేతులతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకెళ్లారు. అనంతరం కడపకు తీసుకెళ్తుండగా హైవేపైకి రాగానే 108 ఎదురవడంతో అందులో కడప రిమ్స్‌కు తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.
ప్రేమోన్మాదమే హత్యకు కారణం
ఆవుల వెంకటేష్ రెండేళ్ల నుంచి ప్రేమ పేరుతో రామకీర్తన వెంటపడుతున్నాడు. ప్రేమించాలని వేధిస్తున్నాడు. పలుమార్లు బాలిక తండ్రితో మీ కూతురు ఇతరులతో ఫోన్ మాట్లాడుతోందంటూ ఫిర్యాదు చేశాడు. దీనికి ఆమె సంగతి మేం చూసుకుంటాం.. నీవు కలగజేసుకోవద్దని శ్రీనివాసులు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రామకీర్తనపై కక్ష పెంచుకున్న వెంకటేష్ శుక్రవారం ఉదయం ఆమెతో ఫోన్‌లో మాట్లాడే యత్నం చేశాడు. బాలిక స్పందించక పోవడంతో ఆవేశంతో ఇంటికి వెళ్లి కొడవలితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.
పోలీసుల కాళ్లుపట్టుకున్న తల్లిదండ్రులు
బాలిక హత్యతో శ్రీనివాసులు బంధువులు, గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. ఖాజీపేట పోలీస్‌స్టేసన్‌కు తరలివచ్చి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని నినదించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరు సరిగా లేదని ఖాజీపేట బస్టాండ్ కూడలిలో రాస్తా్తరోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు టౌన్‌లోకి వాహనాలు రాకుండా జాతీయరహదారి నుంచి ట్రాఫిక్ మళ్లించారు. దీంతో బాలిక బంధువులు జాతీయ రహదారి దిగ్బంధించారు. సుమారు మూడు గంటల పాటు జాతీయ రహదారిపై రాస్తా్తరోకో చేశారు.
నిందితుడిని తక్షణం అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని భీష్మించారు. ఓ దశలో మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని లాఠీచార్జీ చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు యత్నించారు. అయితే బాలిక తల్లిదండ్రులు తీవ్రంగా ప్రతిఘటించారు. రామకీర్తన తల్లిదండ్రులు, బంధువులు పోలీసుల కాళ్లు పట్టుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి తప్పకుండా న్యాయం చేస్తామని దిశా డీఎస్పీ బాలస్వామిరెడ్డి హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.
మాకు న్యాయం కావాలి
మా ఇంటికే వచ్చి నా కూతురి గొంతుకోసి వెళ్లడం దారుణం. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వాడిని వదిలేదే లేదు. మాకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగకూడదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఉరిశిక్ష పడాలి. అంత వరకూ పోరాటం చేస్తూనే ఉంటాం. – శ్రీనివాసులు–నాగమణి, బాలిక తల్లిదండ్రులు


