తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు
ఘటనాస్థలంలో ఆధారాలను బట్టి హత్యకేసుగా నమోదు
హైకోర్టుకు వెళ్తానని చెప్పి యడవల్లి రూట్‌లోకి ఎందుకొచ్చినట్టు?
చిలకలూరిపేట: పల్నాడు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ న్యాయవాది హత్యకు గురయ్యాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన శ్రీరామ హరిప్రసాద్(37) ఒంగోలులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇతనికి భార్య నాగజ్యోతి, ఏడేళ్ల బాబు ఈశ్వర అకీర, ఆరేళ్ల పాప నవనీత ఉన్నారు. ప్రసాద్ తల్లి తిరుపతమ్మ ఒంగోలు న్యాయస్థానంలో అటెండెంట్‌గా పనిచేస్తున్న క్రమంలో ముందుగా మార్కాపురంలో ప్రాక్టీస్ చేసిన ఆయన నాలుగేళ్లుగా ఒంగోలులో ఉంటున్నారు.
గురువారం సాయంత్రం హైకోర్టుకు వెళ్లాలంటూ ఇంటి నుంచి స్కూటీపై ఆయన బయలుదేరారు. రాత్రికి పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకొని శుక్రవారం తెల్లవారుజామున కోటప్పకొండ రోడ్డులో చిలకలూరిపేట వైపు స్కూటీపై వెళ్లారు. ఆ తర్వాత యడవల్లి గ్రామ సమీపంలో రోడ్డు మార్జిన్ పక్కన సుమారు ఐదు అడుగుల పల్లపు ప్రదేశంలో న్యాయవాది మృతదేహంపై స్కూటీ పడి ఉంది. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, ఎస్‌ఐ జి అనిల్‌కుమార్ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఎన్నో అనుమానాలు...
ముందుగా అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను, మృతుడి తలపై గాయాలను గుర్తించి హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహంపై ఎవరో స్కూటీని పడవేసినట్లుగా ఉండడం, మృతదేహం పూర్తిగా వాహనం కింద పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిచ్చింది. దీనికి తోడు స్కూటీ పడిపోయిన ప్రదేశానికి సమీపంలో రోడ్డు మార్జిన్‌లో బండరాయి రక్తంలో తడిసిపోయి ఉండటం న్యాయవాదిని ఎవరైనా బండరాయితో మోది చంపారా అనే అనుమానాలకు తావిస్తోంది.
పోలీసులు రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించారు. దీంతో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి విచారణ చేపట్టారు. హైకోర్టుకు వెళతానన్న న్యాయవాది యడవల్లి రూట్‌లోకి ఎందుకు వచ్చారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కోటప్పకొండ వద్ద నుంచి సీసీ పుటేజీల పరిశీలన చేపట్టారు.
అధికారపార్టీ ప్రజాప్రతినిధితో వివాదం
భూ వివాదాల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధితో న్యాయవాదికి వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. తన బంధువుల పక్షం నిలబడిన విషయమై ఆయనతో విభేదాలు తలెత్తినట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. మృతుడు అందరితో కలుపుగోలుగా ఉంటాడని, స్నేహభావంతో మెలిగే ఆయనను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని మరి కొందరి వాదన. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


