జోరుగా ఇళ్ల మంజూరు

state-wide housing program is in full swing - Sakshi

ఇంటి పత్రంతోపాటు పాసు పుస్తకం జారీ

మొదలైన మార్కింగ్‌ పనులు 

సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఇళ్ల మంజూరు కార్యక్రమం కొనసాగుతోంది. గృహ నిర్మాణశాఖ అధికారులు పట్టాలు పొందిన లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించి ఇళ్లు మంజూరు పత్రంతో పాటు ప్రత్యేకంగా పాసు పుస్తకం అందజేస్తున్నారు. లబ్ధిదారుడి పేరు, మంజూరైన స్కీమ్, ఇంటి విలువ, హౌసింగ్‌ ఐడీ నంబర్, లే అవుట్‌ పేరు, కేటాయించిన ప్లాటు నంబర్, బ్యాంకు ఖాతా తదితర వివరాలను పాసు పుస్తకంలో పొందుపరిచారు. ఇంటి నిర్మాణానికి మార్కింగ్‌ అనంతరం బేస్‌మెంట్, రూఫ్‌ లెవల్, స్లాబ్‌ లెవల్, ఫినిషింగ్‌ స్థాయిల్లో ఎంత మేరకు స్టీలు, సిమెంట్‌ వాడారనే వివరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 1902కి ఫోన్‌ చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఆయా జిల్లాలకు చెందిన గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. 

పరికరాల కొనుగోలుకు 15లోగా టెండర్లు
సొంతంగా ఇళ్ల పట్టాలు, పొసెషన్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండి సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చే లబ్ధిదారులకు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు మార్కింగ్‌ ఇస్తున్నారు. నియోజకవర్గాల మార్కింగ్‌ వివరాలను ఏఈలు సేకరించి రోజూ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు అందజేయాలి. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన పరికరాల కొనుగోలు టెండర్లను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి లేఅవుట్‌ వద్ద పరికరాలు, ధరల వివరాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

టెండర్లు పూర్తి కాగానే నిర్మాణాలు..
ఇళ్ల నిర్మాణాల కోసం పరికరాలు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో టెండర్లను ఆహ్వానించాం. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి చేయాలని ఆదేశించాం. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తాం. 
–అజయ్‌ జైన్, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top