సూర్య, చంద్రప్రభలపై సప్తగిరీశుడు 

Srivari Salakatla Brahmotsavam At 7th Day In TTD - Sakshi

ఏడోరోజు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సూర్య, చంద్రప్రభ వాహనాలపై విహరించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు శంఖు, చక్రం, గద, అభయహస్తం ధరించి చతుర్భుజ కేశవమూర్తి అలంకారంలో దర్శనమిచ్చారు. 

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్యప్రాప్తి 
సూర్యుడు ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్ప స్వామివారు అనుగ్రహించారు. వాహనసేవల్లో పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, డాక్టర్‌ నిశ్చిత, శివకుమార్, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, డీపీ అనంత, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ పాల్గొన్నారు. 

నేడు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల 
అక్టోబర్‌ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్‌ 26  ఉదయం 11.00 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.   

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం 
హైదరాబాద్‌కు చెందిన దండు అనిల్‌కుమార్‌ రూ.10 లక్షలు శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు విరాళంగా అందించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top