Srisailam Temple Darshanam Timings: శ్రీశైలంలో సామాన్య భక్తులకు పెద్దపీట

Srisailam Temple Darsanam Timings: Changes in VIP Protocol Darsanam - Sakshi

వీఐపీ ప్రోటోకాల్‌ దర్శనాల్లో మార్పులు

రోజుకు రెండుసార్లు మాత్రమే వారికి అవకాశం

సర్వదర్శనం భక్తులకు  ఇబ్బంది కలగకుండా చర్యలు 

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ రోజుల్లో సగటున 20 వేల నుంచి 25 వేల మంది,  ప్రభుత్వ సెలవు రోజుల్లో 40 వేల నుంచి 50వేల మంది భక్తులు క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. శ్రావణమాసం, కార్తీకమాసం తదితర పర్వదినాల్లో 70 వేల నుంచి 80 వేల దాకా భక్తులు వస్తుంటారు. వీరు సర్వదర్శనం క్యూలలో వెళ్లి మల్లన్నను దర్శించుకుంటారు. దర్శన సమయంలో వీఐపీలు వస్తే సర్వదర్శన క్యూలలోని సామాన్య భక్తులు కొద్దిసేపు ఆగాలి.

ఈ సమస్యను పరిష్కరించేందుకు దేవస్థానం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సర్వదర్శనం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు సులభంగా స్వామిని దర్శించుకునేలా వీఐపీ  ప్రోటోకాల్‌ దర్శన విధానంలో మార్పులు చేసింది. దీనిని ఈనెల 5 నుంచి దేవస్థానం అమల్లోకి తీసుకొచ్చింది.


రోజుకు రెండు సార్లు మాత్రమే 

దేవస్థానం ప్రవేశపెట్టిన నూతన విధానంలో రోజుకు రెండు సార్లు అది కూడా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రముఖులకు భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 5.30 నుంచి 6.15 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రముఖులకు విరామ దర్శనాన్ని, అభిషేకం, కుంకుమార్చన జరిపిస్తారు. ఆలయానికి వచ్చే ప్రముఖులు తమ పర్యటన వివరాలను కనీసం రెండు రోజులు ముందుగానే తెలియజేయాలనే నిబంధన పెట్టారు.   

సిఫారసు లేఖల విధానంలో మార్పులు
ప్రముఖులు వసతి, దర్శనం, ఆర్జితసేవలను ఇతరులకు సిఫారసు చేసేందుకు ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌ విధానాన్ని వినియోగించేవారు. దీనిని రద్దు చేసి  విధిగా లెటర్‌హెడ్‌ పై కనీసం రెండు రోజులు ముందుగా దేవస్థానానికి సమాచారం ఇవ్వాలని నిబంధన పెట్టారు. అలాగే సిఫారసు  లేఖపై  స్పష్టంగా వసతి కావాల్సిన తేదీలు, దర్శనం, ఆర్జితసేవల వివరాలను, దర్శనానికి వచ్చే భక్తుల ఆధార్, ఫోన్‌ నెంబర్లను తప్పనిసరిగా పొందుపర్చాలి. 


యథావిధిగా స్పర్శ దర్శన వేళలు

ప్రస్తుతం అమలులో ఉన్న స్పర్శ దర్శన సమయాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయం 7 గంటల నుంచి 8.15 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.15 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు  స్పర్శదర్శనం కల్పిస్తారు. అలాగే ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు  భక్తులకు  ఉచిత స్పర్శదర్శనం కొనసాగుతోంది.  


సామాన్య భక్తుల కోసమే మార్పులు 

సామాన్య భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా కల్పించేందుకు ప్రోటోకాల్‌ దర్శనంలో మార్పులు చేశాం. దేవస్థాన ఆగమ కమిటీ, దేవస్థానం ధర్మకర్తల మండలి సూచనల మేరకు ఈ మార్పులు చేశాం. ఈ కొత్త విధానంలో  రోజుకు రెండు సార్లు మాత్రమే  ప్రముఖులకు స్వామి  అమ్మవార్ల దర్శనం, ఆర్జిత సేవలను కల్పిస్తున్నాం. అలాగే  ప్రముఖుల సిఫారసు లేఖల విషయంలో కూడా కొన్ని మార్పులు చేశాం. ఈ నూతన విధానం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చాం.
– ఎస్‌.లవన్న, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top