పాతాళగంగ పైపైకి.

Srikakulam: UnderGround Water Level Increased - Sakshi

సంతకవిటిలో రెండు మీటర్లలోపే భూగర్భ జలాలు

రాజాం, రేగిడి, వంగరలో కూడా..

వేసవిలోనూ నిలకడగా ఉన్న వైనం

రణస్థలం, ఎచ్చెర్ల మినహా జిల్లా మొత్తం సాధారణం 

పాతాళగంగ పొంగిపొర్లుతోంది. నేలబావుల నుంచి బోరు బావుల వరకూ దేన్ని పరిశీలించిన నీరు ఉబికివస్తోంది. గతంలో కంటే భూజగర్భ జలాలు బాగా పెరిగాయి. మండువేసవిలో కూడా సాధారణ పరిస్థితి ఉండడం విశేషం. రాజాం నియోజకవర్గం వ్యాప్తంగా పరిస్థితి మరీ అనుకూలంగా ఉంది. మడ్డువలస జలాశయం ఉన్నందున ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు బాగా పెరిగాయని సంబంధిత అధికారులు అంచనా వేశారు.
 
రాజాం: జిల్లాలో కొన్ని మండలాలు మినహా మిగిలిన చోట్ల భూగర్భ జలాలు బాగున్నాయి. రాజాం నియోజకవర్గం పరిధి సంతకవిటి మండలంలో 1.52 మీటర్ల లోతులోనే లభ్యమవుతున్నాయి. మండువేసవిలోనే ఇలా ఉండగా. వర్షాకాలంలో మరింత మీదకు వచ్చే అవకాశం ఉంది. రాజాంలో 1.72 మీటర్లలో, రేగిడిలో 2.31, వంగరలో రెండు, ఎల్‌ఎన్‌పేట మండలంలో 1.89, సరుబుజ్జిలిలో 1.84, జలుమూరులో 2.82, హిరమండలంలో 2.34, గార మండలంలో 2.34 మీటర్ల లోతులోనే భూ గర్భజలాలు తొణికిసలాడుతున్నాయి. ఈప్రాంతాల్లో బోర్లు తక్కువలోతులో వేస్తున్నా నీరుపడుతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో సాగునీటి కోసం తక్కువ ఖర్చుతోనే వ్యవసాయ బోర్లు, బావులు, ఇంటి అవసరాలకు బోరింగులను వేయించుకుంటున్నారు.

20 నుంచి 30 మీటర్ల లోతుకు వెళ్లగానే కావాల్సినంత నీరు పడుతోంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో వేసవిలో కూడా సాగునీటి చెరువులు, బావులు జలకళను సంతరించుకున్నాయి. రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద అత్యంత ప్రమాదకరంగా 13.91 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఎచ్చెర్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగే పలాస, కంచిలి, సోంపేటలో కూడా భూగర్భ జలాలు కొంతవరకూ అడుగంటాయి. జిల్లా వ్యాప్తంగా లెక్కిస్తే సరాసరిన 7.88 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యమవుతూ సేఫ్‌ జోన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది సుమారు ఎనిమిది మీటర్లగా ఉండేది.

సాగునీటి కాలువలు ఉన్న ప్రాంతాల్లో..  
సాగునీటి కాలువలు, నదులు ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అనుకూలంగా ఉండగా.. పరిశ్రమలు, బీడు భూములు ఉన్న ప్రాంతాల్లో నీటి వనరులు తగ్గుముఖం పడుతున్నాయి. వీటికి తోడు అనుమతులు లేకుండా ప్రైవేట్‌ నేలబావులు తవ్వకాలతో కొన్నిచోట్ల నీటి లభ్యత అనుకూలంగా లేదని  నేషనల్‌ గ్రీన్‌కోర్‌ ఉపాధ్యాయుడు పూజారి హరిప్రసన్న తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top