ప్రతి లే అవుట్‌ను మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం

Sri Ranganatha Raju says that We will model each layout as a model town - Sakshi

పెద్ద లే అవుట్‌లలో బస్టాండ్, అంగన్‌వాడీ కేంద్రాలు 

గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు 

ఒంగోలు అర్బన్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పేదలకు నిర్మించే ఇళ్ల తాలూకు లే అవుట్‌లను మోడల్‌ టౌన్‌లుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో శుక్రవారం గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలతో కలిసి మంత్రి రంగనాథరాజు మీడియాతో మాట్లాడారు. ప్రతి లే అవుట్‌లో తాగునీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక వసతుల్ని అండర్‌ గ్రౌండ్‌ విధానంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద లే అవుట్‌లు ఉన్న చోట్ల బస్టాండ్‌తో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 2, 3, 4, 5 తేదీల్లో భారీగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని కేటాయించి నిర్మాణాలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. 

విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం: మంత్రి సురేష్‌ 
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు తమకు ముఖ్యమని చెప్పారు. అందువల్లే ముందునుంచీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపిందని, పరీక్షల రద్దును కేవలం రెండో ఆప్షన్‌గానే చూశామని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ స్పష్టం చేశామన్నారు.  ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కొమ్ముకాసే నారా లోకేష్‌ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top