'పాలిటెక్నిక్‌' లో నవోదయం | Sakshi
Sakshi News home page

'పాలిటెక్నిక్‌' లో నవోదయం

Published Tue, May 28 2024 6:15 AM

Special training programs for campus recruitment

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌

గతేడాదితో పోలిస్తే రెట్టింపైన క్యాంపస్‌ ఎంపికలు 

ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థులను మాత్రమే ఎంపిక చేసే సంస్థలు తొలిసారిగా ఏపీ పాలిటెక్నిక్స్‌లో రిక్రూట్‌మెంట్లు 

మూరుమూల ప్రాంతాల్లోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లోనూ జాబ్‌ డ్రైవ్‌లు 

18 ఏళ్లకే రూ.8.60 లక్షల వేతనం.. సగటున రూ.3 లక్షల జీతం  

ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తున్న కంపెనీలు  

విద్యార్థులను మార్కెట్‌లోకి రెడీటూ వర్క్‌గా తీర్చిదిద్దేందుకు సాంకేతిక విద్యాశాఖ కృషి 

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు 

వర్చువల్‌ డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లతో సమూలంగా మారిన విద్యాబోధన

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ విద్య సరికొత్త బ్రాండ్‌ ఇమేజ్‌ను సృష్టిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులై.. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసేలోగా బహుళజాతి సంస్థల్లో లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో వివిధ కంపెనీల్లో దక్కుతున్న ఉద్యోగాలకు సంబంధించిన ప్లేస్‌మెంట్లు క్రమేణా పెరుగుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఏకంగా 12 వేల మందికి ఉద్యోగాలు దక్కడం విశేషం.

గతేడాది అత్యధిక వార్షిక వేతనం రూ.6.25 లక్షలుగా ఉంటే.. ఈ ఏడాది రూ.8.60 లక్షలకు పెరిగింది. ప్రతి వి ద్యార్థి సగటున రూ.3 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సా­ధిస్తున్నారు. ఒకప్పుడు 2019కి ముందు 400 కూడా దా­టని ఉద్యోగ అవకాశాలు.. ఇప్పడు వేల మందికి చేరు వ అవుతున్నాయి.2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21­లో 652 పోస్టులు, 2021–22లో 780 కొలువులు మాత్రమే వచ్చాయి. 2022–23లో 6వేల మంది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైతే.. ఈ ఏడాది రెట్టింపైంది. ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్‌ కోర్సులను ఆరేళ్లు చదివి పూర్తి చేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే దక్కించుకోవడం మార్కెట్‌లో పాలిటెక్నిక్‌ విద్య డిమాండ్‌కు అద్దం పడుతోంది.  

ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఉన్నత చదువులు 
రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రభుత్వ, 179 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 35,533 మంది డిప్లొమా ఫైనలియర్‌ చదువుతుంటే.. వీరిలో 12వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. ఇందులో 50 శాతం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పాలిటెక్నిక్‌ విద్యా చరిత్రలో తొలిసారిగా బహుళజాతి సంస్థ టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సంస్థ సాధారణంగా జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు నుంచి బీటెక్‌ గ్రాడ్యుయేట్లను మాత్రమే తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేసేది. కానీ.. ఏపీలో నైపుణ్యాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించింది.

ఇక్కడ అత్యధిక ప్యాకేజీలతో రూ.8.60 వార్షిక వేతనానికి 9 మంది ఎల్రక్టానిక్స్‌ విద్యార్థులకు టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ల్యాబ్‌ ఇంటర్న్‌లుగా, రూ.8 లక్షల వార్షిక వేతనంతో థాట్‌వర్క్‌ల కోసం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లుగా 35 మంది కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ రెండు సంస్థలతో పాటు మెగా ఇంజనీరింగ్, జీఈ ఏరోస్పేస్, మోస్‌ చిప్, సుజ్లాన్, అమరరాజా, ఆర్సెలర్‌ మిట్టల్‌ అండ్‌ నిప్పన్‌ స్టీ ల్,  ఎఫ్‌ట్రానిక్స్, మేధా సర్వో, డాక్టర్‌ రెడ్డీస్‌ లే»ొరేటరీస్, షాపూర్జీ పల్లోంజీ, ఆల్ఫా లావాల్, మారుతీ సుజుకి రాయ ల్‌ ఎన్‌ఫీల్డ్, వీల్స్‌ ఇండియా, స్మార్ట్‌డివి టెక్నాలజీస్, నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్, హెచ్‌ఎల్‌ మాండో ఆనంద్‌ ఇండియా వంటి ప్రధాన సంస్థల్లో డిప్లొమా విద్యార్థులు కొలువుదీరారు.

డిప్లొమా స్థాయిలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సైతం ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేలా సాంకేతిక విద్యాశాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు రెండేళ్లు అనుభవం గడించిన తర్వాత ఉద్యోగులందరికీ బీటెక్‌ విద్యను అభ్యసించేలా తోడ్పాటును అందించనున్నాయి. ఇక్కడ ఉన్నత చదువులకయ్యే మొత్తం ఫీజును కూడా కంపెనీలే భరించనున్నాయి.  

ప్రత్యేక క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ
సాంకేతిక విద్యాశాఖ విద్యార్థులను మార్కెట్‌లోకి రెడీ టు వర్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కరిక్యులమ్‌ అమలు చేస్తోంది. అకడమిక్‌ లెర్నింగ్, ఇండస్ట్రీ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి వర్క్‌షాపులను నిర్వహిస్తోంది. పారిశ్రామికవేత్త­లు,  ఐటీ తదితర కంపెనీల ప్రతినిధుల నుంచి వ­చ్చిన సూచనలతో పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రారంభించింది. అన్ని పాలిటెక్నిక్‌ కా­లేజీల్లో ప్రభు­త్వం వర్చువల్‌ డిజిటల్‌ క్లాస్‌రూమ్‌­లను ఏర్పాటు చేసినందున విద్యార్థులకు లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా థియరీ, ప్రాక్టికల్‌ సబ్జెక్టుల బోధన పకడ్బందీగా అందుబాటులోకి వచ్చింది.

పారిశ్రామిక రంగంలో వస్తు­న్న మార్పులకనుగుణంగా సిలబస్‌ను మార్పు చేయడంతో పాటు వాటి బోధనకు వీలుగా సిబ్బంది కోసం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రో­గ్రామ్‌లను అమలు చేయిస్తున్నారు. పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను ప­రిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. వీటితో పా­టు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఇంటర్వ్యూ­ల్లో చక్కగా రాణించేలా సంసిద్ధం చేసింది. క­ళా­­శాల స్థాయి, క్లస్టర్ల వారీగా, కమిషనరేట్‌ స్థాయి వర­కు మల్టీ లెవల్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లు చేపట్టింది. తద్వారా మహిళా పాలిటెక్నిక్‌లు, మోడల్‌ రెసిడెన్షియల్‌ పాలిటెక్నిక్‌,మైనారిటీ పాలిటెక్నిక్‌ల విద్యార్థులు గణనీయంగా ఉద్యోగాలు పొందారు. పాడే­రు, చీపురుపల్లి, శ్రీకా­కు­ళం, అద్దంకి, శ్రీ­­శైలం, చోడ­వరం వంటి మారుమూల ప్రాంతా­ల్లో చదువుతు­న్న విద్యార్థులు ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విజయం సాధించింది.  

రూ.8.60 లక్షల వేతనంతో.. 
మాది అనంతపురం జిల్లా పామిడి గ్రామం. నాన్న డ్రైవర్‌. అమ్మ గృహిణి. వాళ్లిద్దరూ కష్టపడి చదివించడంతో నేను డిప్లొమాలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ (ఈఈఈ) పూర్తి చేశాను. చివరి ఏడాది చదువుతుండగానే బెంగళూరులోని టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కంపెనీలో రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. ఇది మల్టీ నేషనల్‌ కంపెనీ. నాకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌లోనూ ఉద్యోగం వచ్చినప్పటికీ చిన్న ప్యాకేజీ కావడంతో చేరలేదు. మా కాలేజీలో చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను ముందుగానే నేరి్పంచారు. ల్యాబ్స్, కరిక్యులమ్, క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో రాణించేలా ఇచ్చిన ప్రత్యేక శిక్షణ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించాలని ఉంది.  – ఎన్‌.గౌతమి, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతపురం

‘రెడీ టూ వర్క్‌’ లక్ష్యంతో.. 
మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్‌ విద్యను అందించడంలో ఏపీ విజయం సాధించింది. ఏటా పెరుగుతున్న క్యాంపస్‌ ఎంపికలే ఇందుకు నిదర్శనం. టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, థాట్‌వర్స్, మేధా సర్వో, జీఈ ఏరో స్పేస్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సాంకేతిక విద్యలోని విప్లవాత్మక మార్పులను చూసి ఎంతో ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ విద్యలో ఇంతటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒకటే.

మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు పరిశ్రమల్లో నైపు ణ్య శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులను రెడీటూ వర్క్‌గా తీర్చిదిద్దుతున్నాం. అందుకే రాష్ట్రానికి అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి. డిప్లొమాతో ఉద్యోగం పొందిన విద్యార్థులకు ఆయా సంస్థలే ఉన్నత చదువులకు ప్రోత్సహించేలా కంపెనీలు సైతం అంగీకరించాయి. చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. అందుకే ప్లేస్‌మెంట్లు రెట్టింపయ్యాయి.  
– చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ 

Advertisement
 
Advertisement
 
Advertisement