Best Tourist Places In Mahanandi: ప్రకృతి అందాల ఖిల్లా.. నల్లమల

Special Story On Mahanandi Tourism - Sakshi

అద్భుత జలసంపదకు నిలయంగా మహానంది

ప్రసిద్ధిగాంచిన ఓంకారం

పంచబుగ్గల కోనేర

ప్రకృతి ఒడిలో వైఎస్సార్‌ స్మృతి వనం

చరితకు సాక్ష్యంగా రుద్రకోడు, నాగలూటి వీరభద్రాలయం

అబ్బురపరుస్తున్న జలపాతాలు 

మహానంది/ ఆత్మకూరు రూరల్‌/ బండిఆత్మకూరు: దట్టమైన నల్లమల అడవుల్లో వెలిసిన మహానంది క్షేత్రం మహదానందానికి నిలయం. క్షేత్రానికి వచ్చిన భక్తులు నల్లమల అందాలు చూసి పరవశించిపోతుంటారు. ఆదిదేవుడైన పరమేశ్వరుడి చెంత ఉద్భవించిన స్వచ్ఛమైన గంగాజలంతో కూడిన కోనేరులు ప్రత్యేక ఆకర్షణ. అలాగే పరిసరాల్లోని నవనందుల్లో వినాయకనంది, గరుడనంది క్షేత్రాలతో పాటు సూర్యనంది క్షేత్రం ఉండటం మరో విశేషం. నంద్యాల–గిద్దలూరు ఘాట్‌ రోడ్డులోని పురాతన దొరబావి వంతెన  ఆకట్టుకుంటుంది. పచ్చర్ల వద్ద ఏర్పాటు చేసిన ఎకో టూరిజం, నల్లమలలోని బైరేనీ స్వామి దగ్గరున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.

రుద్రకోడు..  
నల్లమల అడవుల్లో వెలసిన పురాతన శైవ క్షేత్రాల్లో రుద్రకోడు ఒకటి. రుద్రాణి సమేతంగా రుద్రకోటీశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఔషధీయుక్తమైన జలాలతో ఉన్న రుద్రగుండం కోనేరు విశిష్టమైనది. ఈ ఆలయంలో సీతారామస్వామి కూడా కొలువై ఉండడం విశేషం. నల్లకాల్వ గ్రామం నుంచి నల్లమల అడవుల్లో 12 కి.మీ. వెళ్తే ఈ క్షేత్రం చేరుకోవచ్చు. దారిలో గాలేరు ,ముసళ్లవాగు వంటి కొండవాగులను దాటి వెళ్లాల్సి ఉంటుంది. దారిలో డాక్టర్‌ వైఎస్సార్‌ బయోడైవర్సిటి పార్క్‌ ఉంది. ఇందులో సుమారు 600 వృక్ష జాతులు సహజసిద్ధంగా ఉండడం విశేషం. రుద్రకోడు వెళ్లేందుకు నల్లకాల్వ నుంచి ఆటోల సౌకర్యం ఉంటుంది.

జంగిల్‌ క్యాంప్‌.. 
ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని బైర్లూటి గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిందే నల్లమలై జంగిల్‌  క్యాంప్‌. 
నల్లమలై జంగిల్‌ క్యాంప్‌లో కాటేజ్‌లు, టెంట్‌లు విశ్రాంతి కోసం నిర్మించారు.  
బైర్లూటి నుంచి నాగలూటి మీదుగా పురాతన వీరభధ్ర స్వామి ఆలయం దర్శించుకుని తిరిగి క్యాంప్‌ చేరుకునేలా జంగిల్‌ సఫారీ 
ఇలాంటి క్యాంప్‌లు తుమ్మల బయలు, పచ్చర్లలో కూడా ఉన్నాయి. 
సమీపంలోనే శ్రీశైలానికి రెడ్డి రాజులు నిర్మించిన మెట్ల దారిని కూడా చూడవచ్చు.

 

మహిమాన్వితం.. ఓంకార క్షేత్రం  
బండిఆత్మకూరుకు తూర్పు దిశన వెలసిన ఓంకార క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాన మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడ ఉన్న పంచ బుగ్గల కోనేరులో స్నానం చేసి  అమ్మవారు, ఓంకార సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.

‘ఓం’ అనే శబ్దం వినిపిస్తుండేది.. 
అన్ని మంత్రాలకు బీజాక్షరమైన ఓం అనే ప్రవణాదం ఈ ప్రాంతంలో వినిపిస్తుండేది. దీంతో సిద్ధులు అనే మహర్షులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని ఓంకార సిద్ధేశ్వర స్వామిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్న కోనేరులో ఉన్న 5 బుగ్గలలో నుంచి నీరు వస్తుండేది. ఈ విధంగా పంచబుగ్గల 
కోనేరుగా పిలువబడింది.
 

దొరబావి వంతెన.. 
రాష్ట్రంలో ఊగే రైలు వంతెన అంటే ముందుగా గుర్తొచ్చేది నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో బొగద టన్నెల్‌ వద్ద కనిపించే వంతెన. చలమ, బొగద రైల్వేస్టేషన్‌ సమీపంలో భూ మట్టానికి సుమారు 276 అడుగుల ఎత్తులో బ్రిడ్జి నిర్మించారు. 1884లో మొదలుపెట్టి 1887 నాటికి పూర్తి చేశారు. 110 ఏళ్ల పాటు వాడిన ఈ వంతెనను బ్రాడ్‌గేజ్‌ సమయంలో తొలగించారు. బొగద సొరంగం సౌత్‌సెంట్రల్‌ రైల్వేజోన్‌లో ఎక్కువ పొడవైనదని, 1,565 మీటర్లు ఉంటుందని సమాచారం.


వైఎస్సార్‌ స్మృతివనం.. 
వైఎస్సార్‌ స్మృతివనం ప్రాజెక్ట్‌ 22 ఎకరాల్లో రూ.14 కోట్లతో నిర్మించిన ఈ ఉద్యానం వైవిధ్యానికి ప్రతీక. సుమారు 550 ఫల,పుష్ఫ,తీగ,వృక్షజాతులు ఒకే చోట ఉండడం అద్భుతం. 

20 అడుగుల పొడవైన వైఎస్‌ఆర్‌ విగ్రహం చూడ చక్కనైనది. 
అందమైన కాలినడక మార్గాలు, వివిధ జాతుల వృక్షాలు వీక్షించవచ్చు. 
వ్యూ టవర్‌ పై నుంచి నల్లమల అందాలు తిలకించవచ్చు 
కొరియన్‌ కార్పెట్‌ గ్రాస్‌తో ల్యాండ్‌ స్కేప్‌ పరిమళ వనం, సీతాకోక చిలుకల వనం, పవిత్రవనం, నక్షత్ర వనం ప్రత్యేకం


                                                                                       ఓంకార క్షేత్రం 

ఆకట్టుకునే జలపాతాలు.. 
నల్లమలలోని మోట, మూడాకుల గడ్డ, బైరేనీ, చలమ ప్రాంతాల్లో అద్భుతమైన జలపాతాలున్నాయి. గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యంలోని గుండ్లబ్రహ్మేశ్వర ఆలయం వద్ద మూడు కోనేరులు ఉండగా ఎప్పటికీ నీరు తరగదు. బైరేనీ స్వామి కింద నుంచి వచ్చే అద్భుత నీటి ద్వారా నల్లమలలోని వన్యప్రాణులకు తాగునీరు లభిస్తుంది.

మహానందిలోని రుద్రగుండం కోనేరు     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top