గరళాన్ని కాస్తున్న గోదారి లంకలు

Special Enforcement Bureau Destroys Natu Sara Dens In AP - Sakshi

ఎటు చూసినా నాటుసారా ప్రవాహాలు

సముద్రతీరం, లంకలు, కొల్లేరు దిబ్బలు, ఏజెన్సీ అడవులే స్థావరాలు

బట్టీలపై సారా కాచి, భూమిలో పాతరేసి పులియబెట్టి గ్రామాల్లో అమ్మకాలు

సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు జల్లెడ పడుతున్న ఎస్‌ఈబీ

వందల సంఖ్యలో సారా బట్టీలు ధ్వంసం 

హలో సార్‌...ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు తూర్పు గోదావరి జిల్లా ఎస్‌ఈబీ ఏఎస్పీ సుమిత్‌ సునీల్‌ గర్డ్‌ ఫోన్‌ రింగ్‌ అయింది. హలో చెప్పండి.. సార్‌.. నేను ప్రత్తిపాడు మండలంలోని తోటపల్లి గ్రామ వలంటీర్‌ను.. ఓకే.. చెప్పండి.. సార్‌.. మా ఊర్లో పెద్ద ఎత్తున నాటుసారా కాచి వేలాది లీటర్లను పీపాల్లో పెట్టి భూమిలో పాతి నిల్వ చేశారు సార్‌.. సరే నేను చూస్తాను.. అంటూ ఏఎస్పీ ఫోన్‌ కట్‌ చేశారు. వెంటనే కాకినాడ డీఎస్పీ ప్రసాద్‌ కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు.

అక్కడి నుంచి యాక్షన్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. తోటపల్లి  గ్రామ వలంటీర్‌ అందించిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారు. ఉదయం 7.50 గంటలకు ఎస్‌ఈబీ టీం తోటపల్లి ఫారెస్ట్‌లో కూంబింగ్‌ మొదలు పెట్టింది. 10 గంటలకు 112 సారా ఊట పీపాలను గుర్తించింది. 10.05 గంటలకు డీఎస్పీ ప్రసాద్‌.. సిబ్బందితో బయలు దేరారు. గంటన్నరపాటు ప్రయాణించి తోటపల్లికి చేరుకున్నారు. అక్కడ 20 నిమిషాలకు పైగా అడవిలో కాలినడకన ముందుకు సాగి.. సారా డంప్‌ ఉన్న చోటుకు చేరారు. 22,400 లీటర్ల ఊటను వెలికి తీసి ధ్వంసం చేశారు. ఆదివారం అయినప్పటికీ ఎస్‌ఈబీ టీం 8 గంటలపాటు శ్రమించి సారా బట్టీలు, బెల్లం ఊటను ధ్వంసం చేసింది. ఇలా ప్రతిరోజూ గోదారి లంక గ్రామాల్లో జల్లెడ పడుతూ.. నాటు సారా బట్టీలను ఎస్‌ఈబీ బృందాలు ధ్వంసం చేస్తున్నాయి. 

గోదావరి లంకలు.. సముద్ర తీరంలోని ఇసుక తిన్నెలు.. కొల్లేరు దిబ్బలు.. సెలయేటి గట్లు.. పిల్ల కాలువ మాటున బట్టీలు పెట్టి రాత్రిళ్లు నాటు సారా కాస్తున్నారు. దాన్ని ఇసుక తిన్నెలు, గడ్డివాముల్లో కప్పిపెడుతున్నారు. డిమాండ్‌ మేరకు గ్రామాల్లోకి తరలించి పగటి పూట అమ్మకాలు సాగిస్తున్నారు. అక్రమార్జన కోసం కొందరు ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.

నీటిలో బెల్లం కలిపి దాన్ని పులియబెడతారు. దాంట్లో అమ్మోనియా, యూరియా, ఈస్ట్‌.. కిక్కు కోసం మసాలా దినుసులు, ఎండు మిర్చి, స్పిరిట్, యాసిడ్‌ వంటి వాటిని కలిపి వేడి చేసి, సారా తయారు చేస్తారు. ఎక్కడికక్కడ గ్రూపులుగా సారా తయారీ సాగుతోంది. ఇదొక మాఫియాగా పరిణమించడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) దాడులు ముమ్మరం చేసింది. జనం గొంతులో గరళం నింపుతున్న ‘నాటు సారా’పై వేటు వేస్తోంది. 
-ఇర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి

కాపు సారా బడుగు జీవుల బతుకులను కాటేస్తోంది. తాగుడుకు బానిసలైన అనేక మంది నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో 2010లో కల్తీ సారాకు 21 మంది బలయ్యారు. అంబాజీపేట మండలం మొసలపల్లి, జి.అగ్రహారం, అమలాపురం మండలం పాలగుమ్మి, బండారులంక గ్రామాలకు చెందిన పేదలు కల్తీ సారాతో మృత్యువాత పడటం అప్పట్లో సంచలనం రేపింది.

అదే ఏడాది కృష్ణా జిల్లా మైలవరంలో 17 మంది నాటు సారాకు బలయ్యారు. 2013లో ఆలమూరు మండలం మడికి శివారు ప్రాంతం నాగులపేటకు చెందిన సీతెన రాజబాబు (59) కల్తీ సారా తాగి మృత్యువాతపడ్డాడు. సారా మహమ్మారిని తరిమికొట్టాలంటూ రంగంపేట మండలం మర్రివాడలో గతంలో యువత ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోను మహిళలు అప్పట్లో సారా వ్యతిరేక ఉద్యమాలు చేశారు. గత సర్కారు హయాంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ప్రజలు ఫిర్యాదు చేశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. 

బైండోవర్‌లు.. రౌడీషీట్లు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలను సాకారం చేసే దిశగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18 పోలీస్‌ యూనిట్ల ద్వారా పక్కా కార్యాచరణతో, ఒక్కో యూనిట్‌లో ఒక్కో ఐపీఎస్‌ అధికారి(ఏఎస్పీ)కి బాధ్యతలు అప్పగించడం ద్వారా ముందుకు సాగుతోంది. గ్రామాల్లో నాటుసారా కట్టడికి ‘నవోదయం’ పేరుతో ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ (కార్యాచరణ) అమలులోకి తెచ్చింది. సారా తయారీ, అక్రమ మద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే కొరియర్‌ (వేగుల) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా తయారీ కేంద్రాల లెక్కలు తేల్చింది.

అవి ఎక్కడ.. ఎన్ని ఉన్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? తదితర వివరాలను ఎస్‌ఈబీ ప్రత్యేక బృందాలు సేకరించాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 79 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించారు. వాటిలో భారీగా సారా తయారు చేస్తున్నవి 141, ఒక మోస్తరువి 249, తక్కువ మోతాదువి 292 కేంద్రాలు ఉన్నట్టు తేల్చారు. రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న పది వేల మందిని ఇకపై సారా తయారు చేయబోమంటూ హామీ ఇచ్చేలా బైండోవర్‌ చేశారు. ఎంత చెప్పినా వినకుండా సారా తయారీ వీడని 1500 మందిపై రౌడీషీట్లు తెరిచారు. ఆరుగురిపై పీడీ యాక్ట్‌లు పెట్టారు.

సమన్వయం.. సామాజిక పరివర్తన
లాఠీకి పని చెప్పినా వినని వారికి లౌక్యంతో మంచి మాటలు చెప్పి దారికి తెస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని సామాజిక చైతన్యాన్ని తేవడంలో పోలీసులు చేస్తున్న కొత్త ప్రయోగం వారిలో ‘పరివర్తన’ తెస్తోంది. ఇలా రాష్ట్రంలో 436 కుటుంబాల్లో మార్పు తెచ్చారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తొలి జిల్లాగా కృష్ణా జిల్లా రాష్ట్రానికి రోల్‌ మోడల్‌గా నిలిచింది. 

5 లక్షల లీటర్లకుపైగా సారా స్వాధీనం
రాష్ట్రంలో ఎస్‌ఈబీ ఏర్పాటైన గతేడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నాటు సారా తయారీ, రవాణా, అమ్మకాలపై దాడులు నిర్వహించిన పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. 5,00,482 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 1,26,26,673 లీటర్ల బెల్లపు ఊట (సారా తయారీకి ఉపయోగించేది) ధ్వంసం చేశారు. 38,595 కేసుల్లో 32,372 మందిని అరెస్టు చేశారు. 4,653 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.  

ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఆదివారం 200 మందితో కూడిన 12 ఎస్‌ఈబీ ప్రత్యేక బృందాలు 35 వేల లీటర్లకు పైగా నాటు సారా ఊటను ధ్వంసం చేశాయి. 

ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో దశల వారీ మద్య నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రజారోగ్యాన్ని దెబ్బతీసి, ప్రాణాల మీదకు తెచ్చే నాటుసారా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎస్‌ఈబీ అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నప్పటికీ, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలి.  
 – డి.గౌతమ్‌ సవాంగ్, డీజీపీ 

సారా తయారు చేస్తే పీడీ యాక్ట్‌ 
సారా తయారీ మానకుంటే పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతాం. రౌడీషీట్లు తెరుస్తాం. అయినా సారా తయారీ మానకపోతే వారి ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటాం. పట్టుబడిన వారిని వెంటనే రిమాండ్‌కు పంపించేలా జ్యుడిషియల్‌ వ్యవస్థను సంప్రదిస్తున్నాం. నిఘా తీవ్రతరం చేశాం. మొబైల్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ఇన్ఫార్మర్లు, ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం.  
    – వినీత్‌ బ్రిజ్‌లాల్, కమిషనర్, ఎస్‌ఈబీ 

‘పరివర్తన’కు ప్రయత్నిస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా సారా తయారీదార్లు, తయారు చేస్తున్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. తయారీదార్లలో మార్పు తెచ్చేందుకు డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం. వారికి నయానా, భయానా నచ్చజెప్పి సారా జోలికి పోకుండా ‘పరివర్తన’ తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం.   
 – పీహెచ్‌డీ రామకృష్ణ, డైరెక్టర్, ఎస్‌ఈబీ 

సామాజిక బాధ్యతలో గర్వంగా ఉంది
ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో మేము భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. నాటుసారా తయారీ నిలిపి వేసే కుటుంబాలకు ఉపాధి చూపించడంలో భాగంగా ఒక్క కృష్ణా జిల్లాలోనే 170 కుటుంబాలకు చెందిన యువతకు అవుట్‌ సోర్సింగ్‌ సంస్థ ద్వారా ఉద్యోగాలు ఇప్పించాం.     
– పామర్తి గోపీచంద్, చైర్మన్, పీవీఎన్నార్‌ సంస్థ 

సారా జోలికి పోకుండా ఉద్యోగం ఇప్పించారు
చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలోని లంబాడీ తండాలోని చాలా కుటుంబాలకు దశాబ్దాల తరబడి నాటు సారా తయారీయే జీవనాధారం. ఎంటెక్, బీటెక్, డిగ్రీ, ఇంటర్‌ చదివిన మా తరం యువతకు చాలా మందికి ఉద్యోగావకాశాలు రావడం లేదు. దీంతో మేము ఉపాధి కోసం మళ్లీ నాటుసారా తయారీ జోలికి పోకుండా పోలీసులు మాకు అవగాహన కల్పించి చైతన్యం తెచ్చారు. నాకు ఠాకూర్‌ ఆక్వా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం ఇప్పించారు.      
– బుక్యా శ్యామ్‌ సుందర్‌ 

సారా ప్రాణం తీస్తుంది..
సారా తయారీదారులు కిక్కు కోసం అనేక ప్రమాదకరమైన సరుకులు వాడుతున్నారు. కిక్కు కోసం, ఘాటు కోసం వాడే ఆ పదార్థాల వల్ల మనిషి గొంతు నుంచి జీర్ణాశయం వరకు దెబ్బతింటోంది. లివర్‌ సంబంధమైన అనేక తీవ్ర వ్యాధులతో ప్రాణాలు పోయే వరకు దారితీస్తోంది. కిక్కు కోసం అనేక మంది వ్యసనపరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వారి కుటుంబాలను దిక్కులేని వారుగా చేస్తున్నారు. 
    – బి.దుర్గాప్రసాద్, ప్రభుత్వ వైద్యాధికారి, భీమవరం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top