పెళ్లి అయి మూడు నెలలు కాకుండానే.. వ్యాయామం చేస్తూ..

Software engineer died While Doing Exercise in Punganur - Sakshi

సాక్షి, పుంగనూరు (చిత్తూరు): ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆషాడమాసం తర్వాత హనీమూన్‌ వెళ్లాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. విధి వక్రించింది. వ్యాయామం చేస్తున్న యువకుడు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆషాడ మాసానికని పుట్టింటికి వెళ్లిన భార్య భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. పెళ్లి అయి మూడు నెలలు కూడా కాకుండానే కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది.  

పుంగనూరు పట్టణానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి సుధాకర్‌రెడ్డి, భారతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎం.తేజవిష్ణువర్ధన్‌రెడ్డి (27) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లావణ్యతో వివాహం జరిగింది. ఆషాడమాసం రావడంతో లావణ్య గత వారం పుట్టింటికి వెళ్లింది. తేజవిష్ణువర్ధన్‌ రెడ్డికి ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేసే అలవాటు. శనివారం ఉదయం సైక్లింగ్‌ చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.

గమనించిన తండ్రి సుధాకర్‌రెడ్డి వెంటనే డాక్టర్‌ చైతన్యతేజారెడ్డికి సమాచారం అందించారు. ఆయన వచ్చి పరిశీలించి గుండెపోటుతో మృతిచెందినట్టు ధ్రువీకరించారు. భర్త మృతి విషయం తెలుసుకున్న లావణ్య గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ఆషాడం పూర్తికాగానే తిరుమల దర్శనం చేసుకుని హనీమూన్‌కు వెళ్లేందుకు నూతన జంట ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే తేజవిష్ణువర్ధన్‌రెడ్డి మృతిచెందడంతో స్థానికులు కంటతడి పెట్టారు. 

చదవండి: (Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ)

యువకులు జాగ్రత్తలు పాటించాలి 
వ్యాయామం ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఎక్కువ సమయం చేయడం మంచిది కాదు. జిమ్‌లకు వెళ్లేవారు ముందుగా వైద్య పరీక్షలు చేసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ల సూచనల మేరకు వ్యాయామం చేయాలి. గుండెపై ఒత్తిడి తీవ్రం కావడం ద్వారా గుండెపోటుకు గురై క్షణాల్లోనే ప్రాణాలు కొల్పోతారు.    – డాక్టర్‌ చైతన్యతేజారెడ్డి, ప్రముఖ చిల్డ్రన్స్‌ స్పెషలిస్ట్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top