మనసే దేవాలయం 

Sivakumar Reddy and his team Cleaning temples on holidays - Sakshi

చేయిచేయి కలిపి సేవకు శ్రీకారం 

సొంత డబ్బుతో కార్యక్రమాలు 

పాల్పంచుకుంటున్న వందలాది మంది 

ఎంపిక చేసుకున్న ఆలయాల్లో ‘తిరుమంజనం’ 

ఓ కుటుంబంగా మారిన సభ్యులు 

సెలవు రోజుల్లో మానసిక ప్రశాంతత 

మన ఊరు: ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంత సంపాదించినా.. సొంత ఊళ్లో లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. కనీసం పండగలు, పబ్బాలకైనా అక్కడ కాలు మోపకపోతే జీవతమే వృథా అనిపిస్తుంది. 
 
మన గుడి: ఊరు అన్నాక గుడి ఉంటుంది.. బాల్యం అన్నాక ఆ గుడిలో తిరిగే ఉంటాం. కులమతాలకు అతీతంగా ఆడిపాడుతూ కలిసి తిరిగే చోటు కావడంతో ప్రతి ఒక్కరి జీవితం ఈ గుడితో ముడిపడి ఉంటుంది. 

 
మన బాధ్యత: ఓ సినిమాలో చెప్పినట్లు తిరిగివ్వకపోతే లావై పోతాం. ఇది అక్షరాలా నిజం. పుట్టిన ఊరును మర్చిపోతే మనల్ని మనం కోల్పోయినట్లే. ఇక తిరగాడిన గుడి కూడా  అంతే. దేవాలయాన్ని శుభ్రం చేస్తే మనసును కడిగేసినట్లే. 

‘‘అక్కా ఆ పొరక ఇలా అందుకో.. అన్నా ఆ చెట్టు కొమ్మలు కత్తరిద్దాం.. తమ్ముడూ గుడి గోపురం నీళ్లతో కడుగుదాం.. చెల్లీ నవగ్రహాలను శుభ్రం చేద్దాం.. వదినా ఆ చెత్తంతా పోగు చేద్దాం.. సార్‌ చుట్టూ ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిద్దాం.. అమ్మా బండలను నేను తుడుస్తా.. పిల్లలూ ఆ మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త. ఏంటండీ బరువు ఎక్కువగా ఉందా, ఉండండి నేనూ ఓ చేయి వేస్తా.’’ ఏంటీ ఇదంతా ప్రతి ఇంట్లో కనిపించే సందడే కదా అనుకుంటున్నారా? కాదు.. ఒకరికొకరు సంబంధం లేకపోయినా ఆ దైవమే కుటుంబాన్ని ఏర్పరిచింది. ఆప్యాయతను పంచుకునేలా చేసింది.. దూరమవుతున్న అనుబంధాలను గుర్తు చేస్తోంది. ఇదీ జగమంత కుటుంబం. 
– సాక్షి, కర్నూలు డెస్క్‌  

12మే 2022 ఏకాదశి రోజున.. 
గుంటూరులో డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌గా పని చేస్తున్న శివకుమార్‌రెడ్డి స్వస్థలం నంద్యా­ల. సెలవు రోజుల్లో దేవాలయాలను శుభ్రం చేస్తే మంచి జరుగుతుందనే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను అందిపుచ్చుకుని ఆ దిశగా ప్ర­య­త్నం ప్రారంభించారు. ఆ మేరకు మిత్రులు, పరిచయం ఉన్న వ్యక్తులకు ఫోన్లు చేసి, వాట్సాప్‌ గ్రూ­పుల్లో సమాచారం ఇచ్చి కొందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు.

అలా పట్టణంలోని నందీశ్వరాలయా­న్ని చేసేందుకు నిర్ణయించగా, మొదట 150 మందికి తెలియజేయగా 50 మంది సుముఖత వ్యక్తం చేశారు. అయితే ముందురోజు రాత్రి వర్షం కారణంగా 13 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ ముందుగా నిర్ణయించుకున్నట్లు ఉదయం 5 గంటలకు ఆలయానికి చేరుకొని అనుకున్న కార్యాన్ని నాలుగు గంలల్లో పూర్తి చేశారు. 

కమిటీ నిర్ణయం మేరకు.. 
ఏ ప్రాంతానికి వెళ్లాలి, ఏ గుడిని ఎంపిక చేసుకోవాలనే విషయమై కమిటీ సభ్యులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత సంబంధిత గుడి అధికారులకు సమాచారం అందించి అనుమతి పొందుతారు. అనంతరం ఈ విషయమై వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేస్తారు. గుడిని శుభ్రం చేసేందుకు అవసరమైన సామగ్రిని సొంత డబ్బుతోనే కొనుగోలు చేస్తున్నారు.

నెలలో రెండు గుడులు చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్తీక మాసానికి ముందు నవ నందుల ఆలయాన్ని ఒకేరోజు 900 మందితో కలిసి సేవ చేశారు. ఇప్పటి వరకు 32 గుడులను శుభ్రం చేయగా.. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులను ధరించడంతో పాటు దైవనామ స్మరణతో భక్తిభావం పెంపొందిస్తుండటం విశేషం. 

దేవుడిచ్చిన బంధాలు 
ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న రోజులివి. బూతద్దం పెట్టి వెతికినా అన్నదమ్ములు కలిసుంటున్న కుటుంబాలు ఎక్కడో కానీ కనిపించవు. ఈ పరిస్థితుల్లో బంధువులు దూరమవుతుండగా, బంధుత్వాలు శుభకార్యాలకే పరిమితం అవుతున్నాయి. అలాంటిది మన ఊరు, మన గుడి, మన బాధ్యతలో భాగంగా సేవకులంతా ఓ కుటుంబంగా మారిపోతున్నారు.

పిలుపులో ఆప్యాయత కనిపిస్తోంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం చూస్తున్నాం. ఈ బంధం ఇక్కడితో ఆగిపోకుండా తిరిగి ఊరికి చేరుకున్న తర్వాత కూడా ఆయా కుటుంబాలు తరచూ కలసిమెలసి ఉండటం చూస్తే కార్యక్రమం ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతోంది. 

సహపంక్తి భోజనం 
ఒక ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉంటే.. ఎవరు ఏ సమయానికి భోజనం చేస్తారో తెలియని పరిస్థితి. ఇంతకు ముందు ఇంట్లో అందరూ కలిసి కూర్చొని తింటే తప్ప సంప్తి కలిగేది కాదు. కాలంతో పోటీ పడే రోజులు కావడంతో ఎవరి పనుల్లో వాళ్లు బిజీ కావడంతో కలసి భోజనం చేయడమనే మాటే లేకుండా పోతోంది.

అలాంటిది ఈ కార్యక్రమం సభ్యులందరినీ ఓ కుటుంబంగా మార్చేస్తుంది. కార్యక్రమం మధ్యలో అందరూ ఎంచక్కా విస్తరాకులు వేసుకొని ఒక్క చోట కూర్చొని భోజనం చేయడం ఆలయానికి వచ్చే భక్తులను సైతం ఆలోచింపజేస్తోంది. 

గోమాత గోళ్లు కత్తిరిస్తూ.. 
‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ దేవాలయాలకే పరిమితం కాలేదు. గోవులకు గోర్లు పెరిగి నడవటానికి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన సభ్యులు వాటి సేవకు నడుంబిగించారు. ఇ­లాం­టి గోవులను గుర్తించి హాఫ్‌ ట్రిమ్మింగ్, గిట్టలు సరిసేసే కార్యక్రమాన్ని కూడా తరచుగా చేపడుతున్నారు.

ఇప్పటి వరకు 15 ఆవుల కన్నీటిని తుడిచి నడక సజావుగా సాగేందుకు దోహదపడ్డారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో తిరుమల, తిరుపతి.. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మంత్రాలయంలోనూ గోవుల గోళ్లు కత్తిరించేందుకు మానవతామూర్తులు ముందుకు రావడం విశేషం.

ఆర్యోగం కూడా.. 
గుడి శుభ్రం చేయడం ద్వారా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని సేవకులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో తెలియకుండానే ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఈ బృందంలోని ఓ సభ్యుడు ప్రతి రోజూ ఉదయాన్నే 6వేల నుంచి 7వేల అడుగుల నడక కొనసాగిస్తారు.

అయితే ఈ కార్యక్రమం వల్ల దినచర్య కాస్త మారినా, కార్యక్రమం నిర్వహణలో భాగంగా 10వేలకు పైగా అడుగులు పడటం చూస్తే ఆరోగ్యానికి ఏ స్థాయిలో సహకరించిందో అర్థమవుతుంది. ఇంటి వద్ద కనీసం నడిచేందుకు కూడా ఆరోగ్యం సహకరించని వృద్ధులు సైతం గుడిని శుభ్రం చేసేందుకు శక్తినంతటినీ కూడగట్టుకొని ఉత్సాహంగా కలియతిరగడం విశేషం. 

మానసిక ప్రశాంతత 
మా చిన్ననాటి స్నేహితుల కలయికకు గుర్తుగా నంద్యాలలోని ఓ పార్కును 2015లో స్వచ్ఛ భారత్‌ పార్కుగా తీర్చిదిద్దాం. స్వచ్ఛ భారత్‌ స్ఫూర్తితో 2015లో రూపుదిద్దుకున్న ఈ పార్కు దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది. ఇలా 2016లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ అవార్డును కైవసం చేసుకోవడం మరిచిపోలేని అనుభూతి.

ఆ తర్వాత స్నేహితులంతా కలిసి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. తాజాగా ఆలయాలను శుభ్రపరిచే బృహత్‌ కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నాం. ఇది మానసిక ప్రశాంతతో పాటు మానవతా విలువలను నేర్పుతోంది. 
– శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్, గుంటూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top