సీఎం సారూ.. ఆదుకోండి.. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌

Sick victims met with CM YS Jagan At Tenali - Sakshi

ముఖ్యమంత్రిని కలిసిన అనారోగ్య బాధితులు  

వైద్యానికి అయ్యే ఖర్చు మంజూరు చేయాలని కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డికి ఆదేశం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్, మాండూస్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించే కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెనాలి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు అనారోగ్య బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.

హెలిప్యాడ్‌ నుంచి సమావేశానికి వస్తున్న సమయంలో, సమావేశం వద్ద వారు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించి వారికి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, దానికి అయ్యే ఖర్చును కూడా విడుదల చేయాలని కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డిని ఆదేశించారు.  

         

బాపట్ల జిల్లా అమర్తలూరుకు చెందిన పోలియో బాధితురాలు కొల్లూరు జాన్సీ థైరాయిడ్, మానసిక వ్యాధులతో బాధపడుతున్నట్లు ఆమె తండ్రి కిషోర్‌ ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం మంచంలో ఉన్నందున ఆమెకు వస్తున్న పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని, సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆర్థికసాయం అందించాలని కోరారు.  

గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామానికి చెందిన బుల్లా శ్రీనివాస్‌ ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడు కార్తీక్‌ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం రూ.26 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.26 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. 

నకిరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన గడిబోయిన శివలక్ష్మి బ్లడ్‌కేన్సర్‌ చికిత్స కోసం రూ.20 లక్షలు ఖర్చుచేశారు. వీరికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.11 లక్షలు మంజూరయ్యాయి. మిగిలిన మొత్తంతోపాటు ఇతర శస్త్రచికిత్సల కోసం ఆర్థికసాయం చేయాలని కోరారు.  

వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందిన పాపిడిపాగు హదస్సాకు అగ్నిప్రమాదంలో రెండుకాళ్లు పూర్తిగా గాయపడ్డాయి. చికిత్స నిమిత్తం అయ్యే రూ.8.5 లక్షలను సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరు చేయాలని కోరారు.  

కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన గోవాడ సురేష్‌కుమార్‌.. తనకు మెటబాలిక్‌ బేరియాట్రిక్, గాల్‌బ్లాడర్‌లోని రాళ్లకి సంబంధించిన శస్త్రచికిత్స కోసం రూ.15 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఆ మొత్తం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.   

ఐతానగర్‌కు చెందిన దివ్యాంగులు కందుల అహల్య, కందుల అమూల్య తమకు ఆర్థికసాయం చేయాలని కోరారు. 

ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీకి చెందిన కర్నాటి వెంకటనాగమణి.. తనకు రెండు కిడ్నీలు పాడయ్యాయని, దీనికి చికిత్స కోసం రూ.25 లక్షలు ఖర్చయ్యాయని సీఎంకు చెప్పారు. మరో రూ.10 లక్షలు అవసరమని తెలిపారు. ఆ మొత్తాన్ని సీఎంఆర్‌ఎఫ్‌ కింద నిధులు మంజూరు చేయాలని కోరారు.

 

ముత్తంశెట్టిపాలేనికి చెందిన దామర్ల చంద్రశేఖర్‌ పుట్టు మూగ, చెవిటి. పదోతరగతి వరకు చదువుకున్నానని, తన అర్హతల మేరకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని ముఖ్యమంత్రిని కోరారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top