హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ

Shock To SEC Nimmagadda Ramesh Kumar In Ap High Court - Sakshi

నిమ్మగడ్డ ఉత్వర్వులను కొట్టివేసిన హైకోర్టు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డిని నిర్బంధిస్తూ శనివారం ఆయన జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. పెద్దిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలు చెల్లవని తీర్పును వెలువరించింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై ఆదివారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందన్న పిటిషనర్‌ తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చని తీర్పులో స్పష్టం చేసింది. మంత్రిపై ఇంట్లోనే ఉండాంటూ ఆయన విధించిన ఆంక్షలను చెల్లవని పేర్కొంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది.

(మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి)

కాగా రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని సవాంగ్‌ను కోరారు. దీంతో తనను ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర నిమ్మగడ్డ రమేష్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వుల అమలును నిలిపేయాలని కోర్టును కోరారు. ఈ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు. హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి తరఫున వాదనలు వినిపించారు. (మంత్రి పెద్దిరెడ్డిని గృహనిర్బంధం చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top