
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ఓ వ్యాపారిని రాత్రంతా గదిలో నిర్బంధించి దాడి చేసిన ఘటన విజయవాడ భవానీపురం క్వారీ అప్పలస్వామి వీధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాణిగారితోటకు చెందిన ఆర్.శివకృష్ణగౌడ్ తాకట్టు పెట్టిన బంగారం విడిపించి, విక్రయించే వ్యాపారం చేస్తుంటాడు. కొన్నాళ్లు సంగంరెడ్డి శివప్రసాద్‌కు చెందిన శివ గోల్డ్ కంపెనీలో అతడు పనిచేశాడు. మూడు నెలల క్రితం సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో శివ గోల్డ్ కంపెనీ యజమాని శివప్రసాద్ ఈ నెల 2న రాత్రి 9 గంటల తర్వాత క్వారీ అప్పలస్వామి వీధిలోని ఆఫీసు వద్దకు రావాలని శివకృష్ణగౌడ్‌కు ఫోన్ చేశాడు.
అతను వెళ్లేసరికి అక్కడ శివప్రసాద్, అతని భార్య లలిత అనూష, జగదీష్, భానుతోపాటు ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. సొంతంగా వ్యాపారం ఎందుకు చేస్తున్నావ్, వెంటనే మానేయాలని శివకృష్ణగౌడ్‌ను బెదిరించారు. అందుకు అతను అంగీకరించకపోవడంతో శివప్రసాద్, అతని భార్య లలిత అనూష, జగదీష్, భాను, ఇతర వ్యక్తులు అతనిపై దాడి చేశారు. కత్తెరతో ఎడమ చేతిపై గీశారు. నోట్లో హార్పిక్ పోసి చంపేస్తామని బెదిరించారు. మొబైల్ లాక్కుని రాత్రంతా రూమ్‌లో నిర్బంధించారు. మూడో తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో రూమ్ తాళం తీసి బయటకు పంపివేశారు.