
భువనేశ్వర్: 70 శాతం కాలిన గాయాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన ఒడిశా బాలిక నిన్న(శనివారం, ఆగస్టు 2వ తేదీ) మృతిచెందింది. గత నెల 19 వ తేదీన కాలిన గాయాలతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లోచికిత్స అందించిన ఆ బాలికను ఆపై ఎయిర లిఫ్ట్ చేసి ఢిల్లీ ఎయిమ్స్‌కు మార్చారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి ఆపై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారని తొలుత భావించిన పోలీసులు.. ఇప్పుడు మాట మార్చారు. ఇందులో ఎవరు ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఈ కేసు విచారణ తుది దశకు వచ్చిందని ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇది సున్నితమైన అంశమని, లేనిపోని కామెంట్లు చేసి ఇరకాటంలో పడొద్దని కూడా పోలీసులు స్పష్టం చేశారు.
ఆ బాలిక ఘటన అనంతరం ఒడిశాలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన నేపథ్యంలో ఈ కేసు రాజకీయ మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ స్పందించారు. ఆ యువతిని కాపాడటానికి తీవ్ర ప్రయత్నం చేశామని, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా బ్రతికించలేకపోయామని సీఎం మాఝీ తెలిపారు ఇదొక దురదృష్టకర ఘటన అని ఆయన పేర్కొన్నారు.
అంటించలేదు.. అంటించుకుంది..!
తన కూతురు మృతిపై తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘ నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. మానసిక స్థితి బాలేని కారణంగానే ఆమె ఇలా చేసింది. నా కూతుర్ని కాపాడటానికి ఒడిశా ప్రభుత్వం చాలానే చేసింది.. ఫలితం లేకుండా ప్యోఇంది. దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి. అదే నా కూతురి ఆత్మకు శాంతి చేకూర్చినట్లు అవుతుంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు.
పెద్ద ఎత్తున ఆందోళన
జూలై 19 వ తేదీన ఆ బాలిక 70 శాతం గాయాల బారిన పడింది. దీనిపై ఆ సమయంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం దీనిపై ఆందోళన చేపట్టారు. ఒడిశాలో బాలికలపై ఈ తరహా దాడులు అధికమవుతున్నా పట్టించుకునే వారే లేరంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.ఒడిశాలో మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు కూడా రోడ్లపైకి రావడంతో ప్రతిపక్షాలకు బలం చేకూరునట్లయ్యింది. అయితే ఆ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని పోలీసులు, ఆమె తండ్రి చెప్పడంతో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది.
బాలిక వాంగ్మూలం రికార్డు చేశారు..
ఆమెను ఆస్పత్రిలో చేర్చిన క్రమంలోనే వాంగ్మూలం కూడా తీసుకున్నారు పోలీసులు. దానిలో భాగంగానే ముగ్గురు యువకుల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఆ బాలిక మృతి చెందిన రోజు వ్యవధిలోనే ఇందులో ఎవరి ప్రమేయ లేదని తేల్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.