ప్రజాస్వామ్యానికి పాడెకట్టిన బాబు సర్కార్
దాడికి గురైన రైతు పరిరక్షణ కమిటీ నాయకులపైనే ఎదురుకేసులు
పెనుమాక రైతుల ఆహ్వానంపై వెళుతుండగా దారికాచి దాడి..
నాయకుల కార్లు ధ్వంసం చేసిన పచ్చమూకలు
రాళ్లతో, కర్రలతో నడిరోడ్డుపై బరితెగించి హత్యాయత్నం..
మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వీడియోలు, ఫొటోలు
పోలీసుల సాక్షిగా టీడీపీ గూండాలు బరితెగించడం రాష్ట్రమంతా చూసింది..
అయినా దాడిచేసినవారి చేత తప్పుడు ఫిర్యాదులు
దాడికి గురైన వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
తెలుగుదేశం పెద్దల డైరెక్షన్‌లో తాడేపల్లి పోలీసుల యాక్షన్
పెద్దల మెప్పుకోసం వైఎస్సార్‌సీపీ నాయకులపై స్వయంగా కేసు పెట్టిన సీఐ
గతంలోనూ అంబటి, జోగి రమేష్, విడదల రజినీలపై దాడులు.. వారిపైనే ఎదురు కేసులు
ఇదెక్కడి ఆటవిక పాలన అని నివ్వెరపోతున్న ప్రజాస్వామికవాదులు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన అచ్చోసిన పచ్చమూకలు ప్రజాస్వామ్యానికి పాడెకట్టి రోజుకో ఊరులో ఊరేగిస్తున్నాయి. ఎర్రబుక్కు సాక్షిగా రెండేళ్లుగా సాగుతున్న నారా మార్కు నరమేధం మధ్యయుగాల నాటి ఆటవిక పాలనకు అద్దం పడుతోంది. ప్రజలపైనా, ప్రజాస్వామికవాదులపైనా, ప్రతిపక్షాలపైనా యథేచ్చగా దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. వ్యవస్థలను తోలుబొమ్మలు చేసి ఆడిస్తూ రాష్ట్రాన్ని నారా‘కాష్టం’గా మార్చేస్తున్నారు. అధికారమదంతో చెలరేగిపోతూ ప్రత్యర్థులను నానా రకాలుగా హింసిస్తారు.. తిడతారు.. కొడతారు.. దారికాచి దాడులు చేస్తారు.. ఆస్తులు ధ్వంసం చేస్తారు.. బాధితులు లబోదిబో మంటూ పోలీసు స్టేషన్లకెళితే.. అప్పటికే అక్కడ పచ్చమూకలే తిష్టవేసుకునుంటాయి.. ఎదురు కేసులు సిద్ధంగా ఉంటాయి.. వ్యవస్థలన్నిటినీ దారుణంగా దిగజార్చేయడంతో అరాచకం రాజ్యమేలుతోంది.. స్థూలంగా ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. రాజధానిలో శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై దుర్మార్గంగా దాడి చేశారు.. కార్లు ధ్వంసం చేశారు. రాళ్లతో, కర్రలతో హత్యాయత్నం చేశారు. ఇందుకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులు కూడా.. కానీ విచిత్రంగా దాడికి గురైన వారిపైనే పోలీసులు ఆదివారం కేసులు పెట్టారు. దాడికి గురైన వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఏ చెత్తబుట్టలో పదేశారో ఎవరికీ తెలియదు..
పోలీసుల సాక్షిగా బరితెగించిన టీడీపీ గూండాలు..
మట్టి, ఇసుక మెక్కి మదమెక్కిన రౌడీ మూకలు మద్యం సేవించి మరీ పట్టపగలు పోలీసుల సాక్షిగా వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి తెగబడడం టీవీ చానళ్లు చూశాయి.. సోషల్ మీడియాలో వీడియోలు తిరిగాయి.. రాళ్లు రువ్విన రౌడీలను, కర్రసాము చేసిన కసాయిలను, గుడ్లు విసిరిన గూండాలను ప్రజలు చూశారు. పోలీసులు చూశారు. అయినా దాడికి గురైనవాళ్లపై కేసులు నమోదయ్యాయి. పెనుమాక రైతుల విజ్ఞప్తి మేరకు ఆ మార్గంలో వెళుతున్న రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై పట్టపగలు రాళ్లు, కర్రలతో హత్యాయత్నానికి దిగడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది. కానీ దాడిచేసినవారిది తప్పు కాదంట.. రైతు పరిరక్షణ కమిటీ నాయకులు అమరావతికి వెళ్లడమే తప్పట. వారికి ఏం పని? ఎందుకు వెళ్లారని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ప్రశ్నిస్తున్నారు. 
వైఎస్సార్‌సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు
అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో ఉందా లేక పాలస్తీనా– ఇజ్రాయిల్ సరిహద్దులోని గాజా ప్రాంతంలో ఉందా అని సగటు పౌరుడికి సందేహం రాకమానదు.. అమరావతికి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? లేక రాష్ట్రప్రభుత్వం నుంచి పచ్చమూకల నుంచి పర్మిషన్ తీసుకోవాలా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యే ‘నేను తెలంగాణ ఎందుకు రాకూడదు.. రావడమే కాదు రాజకీయం కూడా చేస్తా’నంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో చిందులు వేయడం అందరూ చూశారు. మరి పవన్ కల్యాణ్ ‘హైదరాబాద్ హమారా’ అనవచ్చు గానీ.. వైఎస్సార్సీపీ నాయకులు అమరావతిలో తిరగడం తప్పెలా అవుతుంది. దారిని పోతున్న మమ్మల్ని అడ్డుకుని, దాడి చేసి, కార్లు ధ్వంసం చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టడం ఏం న్యాయమని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయ్యా మేం పిలిస్తేనే వాళ్లు వస్తున్నారు అని పెనుమాక రైతులు కూడా చెబుతున్నారు. ఇవేవీ చంద్రబాబు బధిర సర్కారు చెవికెక్కడం లేదు.
దాడికి గురైన వారిపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు..
సిఆర్‌డిఎ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై శనివారం ఉండవల్లి సెంటర్‌లో జరిగిన దాడిలో నిందితులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నా వారిని అరెస్టు చేయకపోగా, బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. శనివారం పెనుమాక రైతుల కోరిక మేరకు వారి ఇబ్బందులను తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్తున్న సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. కార్యకర్తలు ముందస్తు వ్యూహంతో అడ్డుకోవడం, వారిపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నేత నూనె ఉమామహేశ్వరరావు కార్లను ధ్వంసం చేశారు.
తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షునితో పాటు లోకేష్ కోటరీలోని వ్యక్తులే స్వయంగా ఈ దాడులకు నేతృత్వం వహించారు. మహిళలతో కోడి గుడ్లు వేయించారు. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఇతర నేతలపై దాడికి దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారు. టీఎన్‌టీయూసీ నేత రాయపూడి కిరణ్‌బాబు విసిరిన రాయి పోలీసు కానిస్టేబుల్‌కు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంత జరిగినా తాడేపల్లి పోలీసులకు చీమ కుట్టినట్లు లేదు. పైగా తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేషన్‌కు పిలిపించుకుని రెండు మూడు సార్లు ఫిర్యాదును మార్చి చివరకు పెనుమాక గ్రామానికి చెందిన తెనాలి మాణిక్యం అనే మహిళా నాయకురాలితో ఫిర్యాదు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఇదీ తప్పుడు కేసు...
పోలీసులు నమోదు చేసిన క్రైం నెంబర్ 412/2026 ప్రకారం శనివారం ఉదయం సుమారు 11.30 గంటలకు ఉండవల్లి గ్రామంలోని అమ్మ హోటల్ సెంటర్ వద్ద మాణిక్యంతో పాటు జంగాల భవాని తదితర మహిళలు ఉండగా, పానుగంటి చైతన్య, డైమండ్ బాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, లెళ్ల అప్పిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల నారాయణ (మూర్తి), మేక శివారెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డి తదితరులు కార్లలో అక్కడికి చేరుకుని అమరావతి రాజధాని, రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, వారిని ప్రశ్నించిన ప్రజలపై బెదిరించడంతో పాటు తనను, రాయపూడి కిరణ్‌బాబును కులం పేరుతో అవమానించారని, కొందరు నిందితులు చేతులు, కాళ్లు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 189(2), 115(2), 118(1), 131, 351(2), 79 , 190తో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 2015లోని 3(1)(ఆర్), 3(1)(ఎస్), 3(2)(వి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాస్తవానికి దాడులు చేసింది, కోడిగుడ్లు విసిరింది తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళా నాయకులే. కానిస్టేబుల్‌పై రాయితో దాడిచేసి గాయపరిచిన రాయపూడి కిరణ్‌బాబును కేసు నుంచి తప్పించేందుకే ఈ నాటకం ఆడుతున్నారు. తమపైనే దాడి జరిగిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య (ఫైల్)
వైఎస్సార్సీపీ నాయకులపై సీఐ ఫిర్యాదు.. కేసు..
తెలుగుదేశం పార్టీ పెద్దల డైరెక్షన్‌కు అనుగుణంగా... వారు తానా అంటే.. పోలీసులు తందానా అంటున్నారు.. తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు రెండాకులు ఎక్కువే చదివారు..... ఆయన స్వయంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసి 413/2026 కింద కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, పానుగంటి చైతన్య తదితరులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కార్లలో పెనుమాక గ్రామం వైపు వెళ్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఉండవల్లి సాయిబాబా ఆలయం సమీపంలో వారిని అడ్డుకున్నారని, అదే సమయంలో టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని అమరావతి రాజధానికి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో పోలీస్ చట్టం సెక్షన్లు 30, 30–ఏ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, అనుమతి లేకుండా ముందుకు వెళ్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు హెచ్చరించినప్పటికీ, మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా ఇతరులు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే అంబటి రాంబాబుకు వర్తించే పోలీసు సెక్షన్ 30, 30–ఎ తెలుగుదేశం నాయకులకు ఎందుకు వర్తించడం లేదో పోలీసులే చెప్పాలి. ఉదయం నుంచి వంద మందికి పైగా మోహరించి రోడ్డుపై బైఠాయించినా వారిని అదుపులోకి తీసుకోలేదు. వారికి కాపలాగా నిలబడ్డారు. వారు వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లతో దాడులు చేస్తున్నా వారిని అదుపులోకి తీసుకోకుండా వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేసేందుకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ప్రయత్నించారు. దీన్ని వారించడానికి వచ్చిన అంబటి రాంబాబును కూడా పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేయడంతో ఇరువురి మద్య తోపులాట జరిగింది. దీన్ని అడ్డం పెట్టుకుని సీఐ బీఎన్‌ఎస్ 223, 132, 3(5),పోలీస్ చట్టం, 1861లోని సెక్షన్లు 30, 30–ఏ కింద కేసు నమోదు చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు తమపై హత్యయత్నం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు కట్టామని చెబుతున్న పోలీసులు ఆ ఎఫ్‌ఐఆర్‌ను బయటపెట్టడం లేదు. ఆదివారం ఎమ్మెల్సీ మేకతోటి ఆరుణ్‌కుమార్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై జరిగిన దాడి వీడియోలు, సీసీ ఫుటేజ్, విడియోలు, ఫోటోలు అందచేశారు.
మాజీ మంత్రులపై గతంలోనూ ఎదురుకేసులు
తిరుమలలో లడ్డూ అంశంపై టీడీపీ చేస్తున్న విషప్రచారాన్ని నిరసిస్తూ చేసిన ఆందోళనలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం శ్రేణులు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిలపై దాడులకు పాల్పడటమే కాకుండా వారిపైనే తిరిగి కేసులు పెట్టారు.. గుంటూరు నగరం గోరంట్ల వద్ద తెలుగుదేశం ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పై దాడికి ప్రయత్నించడమే కాకుండా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అతని ఇంటిపై, కార్యాలయం పై దాడి చేశారు. ఏడు గంటలసేపు విధ్వంసం సృష్టించారు. తిరిగి అంబటి రాంబాబును ఆరెస్ట్ చేసి 18 రోజుల పాటు జైలులో ఉంచారు. దాడి చేసిన వారికి 41 నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి విధ్వంసం సృష్టించారు. పైగా అతనిపైనే తిరిగి కేసు పెట్టారు. తిరుపతి లడ్డు వ్యవహారం పై చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం బోయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి విడదల రజిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు జరుగుతుండగానే ఆలయం ముందుకు వచ్చి బరితెగించిన టీడీపీ గూండాలు హల్‌చల్ చేశారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న విడదల రజిని పై దాడి కి యత్నించారు. కారును అడ్డుకుని, ముందుకు కదలనివ్వకుండా చేసిన టీడీపీ గూండాలు. కారుపై చేతులతో గుద్దుతూ, దాడి చేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అనంతరం ఆమె పైనే తిరిగి కేసు పెట్టారు.


