
పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో గాఢ అంధకారం నెలకొంది. రెండు రోజులుగా విద్యుత్ కోతకు విసిగిపోయిన ప్రజలు చిమ్మచీకట్లో నడిరోడ్డుపై చేపట్టారు. ఆగ్రహంతో విద్యుత్ సిబ్బందిని రామాలయంలో నిర్భంధించారు. విద్యుత్ అధికారులు, మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

48 గంటలుగా కరెంట్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ఇంటర్నెట్ కూడా ఆగిపోయింది. ఇళ్లలో నీరు లేక విద్యుత్ శాఖపై ప్రజలు ఎదురుతిరిగారు. విద్యుత్‌ను వెంటనే పునరుద్ధరించాలని ప్రజలు ఆందోళనకు దిగారు.

మరోవైపు, జాతీయ రహదారిపై బైఠాయించిన ప్రజలు.. ఏఈ నాగేశ్వరరావు, ఏడీఈ రంగారావులను ఓ గదిలో నిర్బంధించారు. పరిస్థితి అదుపు తప్పడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున జనం రోడ్డుపైకి వచ్చారు. జనాన్ని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. అదనపు బలగాలను రప్పించాలంటూ సాలూరు పోలీసులు ఉన్నతాధికారులను కోరారు.