
సాక్షి, అమరావతి: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ప్రజా సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఓటమి భయంతో ప్రజలను అవమానిస్తున్న టీడీపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరముందని పేర్కొంది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వంద శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్‌ను ప్రజలు శాశ్వతంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 20 నెలల్లోనే ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా సుపరిపాలన అందించిన జగన్‌ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే...
ప్రజలనే అవమానిస్తావా బాబూ!
ఓటమి భయంతో చంద్రబాబులో ఉక్రోషం తారస్థాయికి చేరింది. ఇష్టమెచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పాచి పనులు చేసుకోడానికి వెళ్లే ప్రజలు అమరావతి కోసం ఏమీ చేయడం లేదంటున్నాడు. ప్రజలకు రోషం లేదంటున్నాడు. సిగ్గూ ఎగ్గూ లేదని ప్రజలను ఘోరంగా అవమానిస్తున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుకు ప్రజలతో ఎప్పుడూ సంబంధం లేదు. మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు. ప్రతి ఎన్నికల్లోనూ వేరే వాళ్లతో పొత్తు పెట్టుకుని, వాళ్లను మింగేసి అధికారంలోకి వచ్చాడు. అసలు అధికారం ఈయన సొత్తు అనుకుంటున్నాడా. శాశ్వతంగా ప్రజలు ఈయనకు బానిసలుగా ఉండాలనుకుంటున్నాడా. 2019 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా.. చంద్రబాబు ఆయన కొడుకు ప్రజలు, సీఎంపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు పీకడానికి చంద్రబాబు దగ్గరేముంది. జనమే ఎప్పుడో వాళ్లను పీకేశారు. చంద్రబాబును ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు. అందుకే కనీసం ఆ పార్టీ తరఫున నామినేషన్లు వేసేందుకే ఎవరూ ముందుకు రావడం లేదు. వైఎస్ జగన్ 21 నెలల కాలంలోనే ప్రజల నుంచి వంద శాతం మార్కులు సంపాదించారు. అవినీతి రహిత, పారదర్శక పాలనను ప్రజల ముంగిటికు తీసుకెళ్లారు. ఆయన పథకాలు 95 శాతం ప్రజల జీవితాలను తాకాయి. ఆ స్పర్శతో ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే జగన్ పథకాలు, ఆశయాలు మరింత ముందుకెళ్తాయి.
రిపబ్లిక్ టీవీపై చట్టపరమైన చర్యలు
వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన కథనాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. తప్పుడు కథనం ప్రసారం చేసినందుకు ఆ చానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. పొగ, నిప్పు ఏదీ లేకుండానే ఇలా తప్పుడు కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం దురుద్దేశపూరితమేనన్నారు. నిజానికి ఆ టీవీ కథనాన్ని పట్టుమని పదిమంది కూడా ఏపీలో చూసి ఉండకపోవచ్చు కానీ, ఎన్నికల వేళ ఇలాంటి ప్రచారం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా జనంలో ఊపు ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని, వాతావరణం ఎంత సానుకూలంగా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారని తెలిపారు.
దీని వెనుక చంద్రబాబు హస్తం
ఇలాంటి తప్పుడు కథనాల వెనుక చంద్రబాబు ఉన్నాడా అనే అనుమానాన్ని సజ్జల వ్యక్తం చేశారు. ఆ చానల్ అధినేత ఆర్నబ్ గోస్వామి గురువు చంద్రబాబేనని సందేహించాల్సి వస్తోందన్నారు. రిపబ్లిక్ టీవీ ఇప్పటికే విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ప్రజలకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో తామీ స్పష్టత ఇవ్వాల్సి వస్తోందన్నారు. అసలు తిరుగుబాటు సంకేతాలు టీడీపీలోనే కనిపిస్తున్నాయని, ఆ పార్టీ నేతలంతా ప్రస్ట్రేషన్‌తో ఊగిపోతున్న తీరే దీనికి నిదర్శనమన్నారు. ఇలాంటి వాస్తవ పరిస్థితిని వదిలేసి తప్పుడు కథనాలు రాయడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం తమ ఎంపీలను సంప్రదించి నిజం తెలుసుకుంటే బాగుండేదన్నారు. ఇలాంటి పెయిడ్ ప్రచారాల వెనుక రాష్ట్రంలో ఎవరున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.