కారుణ్య నియామకాలు 30లోగా పూర్తి

RTC MD Dwaraka Tirumala Rao Orders about Compassionate placements - Sakshi

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు

ఎంపిక ప్రక్రియకు విధివిధానాలు జారీ

బాధిత కుటుంబాల్లో అర్హులు లేకపోతే ఎక్స్‌గ్రేషియా  

సాక్షి, అమరావతి: కారుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులిచ్చారు. కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబసభ్యులకు ఉద్యోగాలిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఆర్టీసీ సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విధి విధానాలు, షెడ్యూల్‌ను నిర్దేశిస్తూ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నియామక ప్రక్రియ ఇలా..
► ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్లు తమ పరిధిలోని అర్హుల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 20లోగా పూర్తి చేస్తారు. 
► జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి ఉద్యోగుల ఎంపికను జోనల్‌ సెలక్షన్‌ కమిటీలు ఈ నెల 23లోగా పూర్తి చేస్తాయి.
► కండక్టర్, డ్రైవర్, శ్రామిక్‌ పోస్టులకు ఎంపికను రీజనల్‌ కమిటీలు ఈ నెల 25లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 
► ఎంపికైన వారికి ఈ నెల 27లోగా వైద్య పరీక్షలు చేస్తారు. 
► జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్‌ ఉద్యోగాలకు రీజనల్‌ మేనేజర్లు ఈనెల 30లోగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అనంతరం శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.  
► కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అర్హులైనవారు లేకపోతే ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. క్లాస్‌–4 ఉద్యోగి కుటుంబానికి రూ.5 లక్షలు, నాన్‌గెజిటెడ్‌ అధికారి స్థాయి కుటుంబానికి రూ.8 లక్షలు, గెజిటెడ్‌ అధికారి స్థాయి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. 

ఉద్యోగ సంఘాల హర్షం..
కారుణ్య నియామకాల ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పి.దామోదరరావు, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top