తణుకు ఆర్టీసీ డిపోలో ధర్నా చేస్తున్న ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు
ప్రైవేటు ఆపరేటర్లకు విలువైన ఆస్తులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు దారుణం
రాష్ట్రవ్యాప్తంగా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా
సాక్షి నెట్‌వర్క్: ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుండడం దుర్మార్గమని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద నిరసన తెలిపి ధర్నా చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం డిపోలో గేట్ ధర్నాలో ఈయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎం.డి.ప్రసాద్ మాట్లాడుతూ విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే విద్యుత్ బస్సుల ఆపరేటర్ల కోసం విద్యాధరపురం, గుంటూరు – 2, నెల్లూరు – 2 డిపోలను ఖాళీ చేయించారని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చర్యలు మానుకుని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలని కోరారు. మరోవైపు స్త్రీ శక్తి పథకం కోసం మూడు వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈయూ ఆధ్వర్యంలో కందుకూరు, పొదిలి, శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో, కర్నూలు – 2 డిపో ఎదుట చేసిన ధర్నాలో కొండల్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతాడ వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి పి.నానాజీరావు, కె.దశరథుడు, జి.త్రినాథరావు, ఈయూ రీజినల్ సెక్రటరీ ఏవీ రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నెల్లూరు డిపో–1, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నిర్వహించిన ధర్నాల్లో ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఎండీఏ ఆలీ, ఈయూ జోనల్ కార్యదర్శి బాబుశామ్యూల్, లుక్సన్, పి.రాజేశ్వరరావు, ఎస్‌వీ రమణ, వై.వి.ఎస్.కుమార్, ఎం.వి.ఆర్.చారి కె.ఎం.రావు, ఈయూ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


