
ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఢీకొని మహిళ మృతి
మరొకరికి గాయాలు
విశాఖపట్నం: ఆ కుటుంబం ఆదివారం ఎంతో సంతోషంగా గడిపింది. మనుమడి అన్నప్రాశన వేడుకను సంబరంగా జరుపుకుంది. మరుసటి రోజు ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి ప్రయాణమైన ఆమెను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం ద్వారకా బస్టాండ్‌లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (47), తన పెద్ద కుమార్తె కుమారుడి అన్నప్రాçశన కోసం గాజువాకలో ఉన్న ఇంటికి వచ్చింది. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణమై, ద్వారకా బస్టాండ్‌కు చేరుకుంది.
సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో తన చిన్న కుమార్తెను బొబ్బిలి బస్సు ఎక్కించి, తాను ఎస్.కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్‌ఫాం నంబర్ 25 వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లె వెలుగు బస్సు అతి వేగంగా ప్లాట్‌ఫాంపైకి దూసుకువచ్చింది. ఆ బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ తల్లి, మనుమడిని చూసుకున్న సంతోషం మనసులో మెదులుతుండగానే, విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. ముత్యాలమ్మ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
బస్సు స్పీడ్‌గా వచ్చేసింది..
నేను అరకు వెళ్లాలి. బస్సు కోసం ఎస్.కోట ప్లాట్‌ఫాం వద్ద సమీపాన కూర్చున్నా... పదడుగుల దూరంలో ఆ మహిళ బ్యాగ్ పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో ఆర్టీసీ బస్సు స్పీడ్‌గా ఆమెను ఢీకొని లోపలికి వచ్చేసింది. చూస్తుండుగానే ఆ మహిళ బస్సుకు అక్కడున్న స్తంభానికి మధ్యలో నలిగిపోయింది. ఇంకో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
– కమిడి గురు, అరకు, ప్రత్యక్ష సాక్షి
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాంపైకి బస్సు తీసుకొచ్చేటప్పుడు గంటకు 5 కిలోమీటర్ల వేగం మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, వేగంగా వచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. వెహికల్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ తర్వాత ఈ విషయం స్పష్టమైంది. దీనిపై డ్రైవర్ చంద్రరావును ప్రశ్నించగా, బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది.