‘రంగరాయ’లో దొంగాట | Rs 20 Lakh Property Worth Stolen From Rangaraya Medical College | Sakshi
Sakshi News home page

‘రంగరాయ’లో దొంగాట

Jan 2 2021 10:55 AM | Updated on Jan 2 2021 12:45 PM

Rs 20 Lakh Property Worth Stolen From Rangaraya Medical College - Sakshi

కాకినాడ క్రైం: రంగరాయ వైద్య కళాశాల మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్‌లోని బీరువా నుంచి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.20 లక్షల డబ్బు మాయమైంది. ఆలస్యంగా అదీ అనుమానాస్పదంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై గత నెల 29న కాకినాడ టూటౌన్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.  

అసలేం జరిగింది 
గత నెల 17న రంగరాయ వైద్య కళాశాలలోని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్‌లోని ఓ బీరువా నుంచి రూ.20 లక్షల సొత్తు చోరీకి గురైంది. సంబంధిత సీనియర్‌ అసిస్టెంట్‌ ఆ డబ్బును బీరువాలో భద్రపరిచానని చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు నుంచి 13 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వరరావు పేరుతో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కాకినాడ టూ టౌన్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.  

విద్యార్థుల నుంచి నేరుగా వసూలు 
గత నెల 16లోపు రంగరాయ వైద్య కళాశాలలో కొత్తగా సీటు పొందిన విద్యార్థులు 120 మందికి పైగా కళాశాలలో చేరారు. అడ్మిషన్‌ ఫీజును నేరుగా తనకివ్వాలని, తానే డీడీ తీస్తానని చెబుతూ సీనియర్‌ అసిస్టెంట్‌ చాలామంది నుంచి రూ.24 వేల చొప్పున వసూలు చేశారు. అలా వసూలు చేసిన ఆ సొత్తు విలువ రూ.20 లక్షల పైచిలుకు. బ్యాంకు నిబంధనలను అనుసరించి రూ.24 వేల విలువైన డీడీ తీయాలంటే విద్యార్థి తన ఖాతా నుంచి తన సంతకంతో డీడీ సొమ్ము బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా డబ్బు వసూలు చేయడం గమనార్హం. 


జవాబు లేని ప్రశ్నలు 
తాను విద్యార్థుల నుంచి రూ.24 వేల చొప్పన వసూలు చేశానని చెబుతున్న సీనియర్‌ అసిస్టెంట్‌ ఆ డబ్బును ఎవరో కుట్ర పూరితంగా దోచేశారని అంటున్నారు. ప్రిన్సిపాల్‌ మాత్రం ఆ డబ్బు సీనియర్‌ అసిస్టెంట్‌ వ్యక్తిగత సొమ్ము అంటున్నారు. పరస్పర విరుద్ధంగా వీరు చెబుతున్న మాటలతో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన సొమ్మే పోయిందా? దానికి పర్సనల్‌ కలర్‌ ఇస్తున్నారా? వంటి అంశాలు విచారణలో నిగ్గు తేలాల్సి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement