
సాక్షి, పల్నాడు జిల్లా: వినుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఎర్రగొండపాలెం నుంచి వినుకొండ వైపునకు కూలీలతో వెళ్తున్న ఆటో.. వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి..
పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం ప్రమాద ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. వారంతా మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.