కృష్ణమ్మ పరవళ్లు

Rising flood in Godavari - Sakshi

శ్రీశైలంలోకి 1.15 లక్షల క్యూసెక్కులు రాక

ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్న తెలంగాణ సర్కార్‌

ఫలితంగా శ్రీశైలంలో పెరగని నీటిమట్టం

ప్రకాశం బ్యారేజీ నుంచి 4,530 క్యూసెక్కులు కడలిలోకి..

గోదావరిలో పెరుగుతున్న వరద

సాక్షి, అమరావతి: కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్‌ నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 28, 252 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదు. బుధవారం నాటికి శ్రీశైలంలో 843.7 అడుగుల్లో 67.84 టీఎంసీ లు నిల్వ ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గురువారం కూడా శ్రీశైలంలోకి ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది.

పులి చింతలలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్‌ వదిలేస్తున్న నీటికి.. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహంతో కలిపి ప్రకాశం బ్యారేజీ లోకి 9,080 క్యూసెక్కులు వస్తోంది. ఇందులో 4,5 50 క్యూసెక్కులను సాగునీటి కాలువలకు ఇస్తూ.. మిగులుగా ఉన్న 4,530 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 66 వేల క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 59 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top