విద్యాభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో అద్భుతం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం

Representatives Of Goa Appreciated Educational Development In AP - Sakshi

ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం

దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలు

గోవా రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ ప్రశంసలు

సాక్షి, అమరావతి: ఏపీలో అమలుచేస్తున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయని గోవా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతినిధులు ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా ఈ కార్యక్రమాలు నిలుస్తున్నాయన్నారు. గోవా స్టేట్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రతినిధులు, గురువారం ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ను సందర్శించారు. జాతీయ విద్యా విధానం–2020 అమలులో ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విధానాలను పరిశీలించారు.

మల్టీ డిసిప్లినరీ, ప్రవేశ పరీక్షల నిర్వహణ, డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ఇంటర్న్‌షిప్, న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్, ఎన్బీఏ ర్యాంకింగ్స్‌లో ఏపీ చేపడుతున్న చర్యల గురించి మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ప్రతినిధి బృందానికి వివరించారు. డిగ్రీ మూడో సంవత్సరం చదువు తర్వాత ఎగ్జిట్‌ అండ్‌ ఎంట్రీ ఆప్షన్, ఆపై పరిశోధనతో నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ఏపీ ఎలా ప్రవేశపెట్టిందో తెలిపారు. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో 10 నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ, జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలు ఇంటర్న్‌షిప్‌ల పురోగతిని పర్యవేక్షిస్తున్నాయని ఆయన చెప్పారు. పరిశ్రమలతో విద్యా సంస్థల అనుసంధానం కోసం ’ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్‌ కనెక్ట్‌ పోర్టల్‌’ను ఏర్పాటుచేశామన్నారు. ఎల్‌ఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, సేల్స్‌ఫోర్స్, మైక్రోసాఫ్ట్‌ మొదలైన బహుళజాతి కార్పొరేట్‌ సంస్థలు, నాస్కామ్‌ సహకారంతో 1.75 లక్షల మందికి ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నట్లు హేమచంద్రారెడ్డి వివరించారు. ప్రొఫెషనల్‌ కోర్సులలో ప్రవేశానికి వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ, సంప్రదాయ డిగ్రీ ప్రోగ్రామ్‌ల కోసం ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాల నిర్వహణ గురించి కూడా ఆయన వివరించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనా అభినందనలు
ఇక పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ అయిన జగనన్న విద్యా దీవెనతో పాటు జగనన్న వసతి దీవెన కింద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని గోవా బృందం అభినందించింది. రాష్ట్రంలోని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 86 శాతం మంది విద్యార్థులకు ఇది ప్రయోజనం చేకూరుతుండడం అద్భుతమని.. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాల్లేవని కొనియాడింది. నూతన విద్యా విధానం–2020ని అమలుచేయడంలో ఏపీ కృషిని బృందం ప్రశంసించింది. అలాగే, రూ.32.కోట్లతో ప్రత్యేక పోర్టల్‌ ద్వారా రాష్ట్రంలోని 3.5 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రశంసించింది. మండలి వైస్‌చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె. రామ్మోహనరావు, కార్యదర్శి ప్రొ. సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ కూడా బృందంతో సంభాషించారు.  

గోవా బృందంలో టీచింగ్‌ లెర్నింగ్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ, స్టేట్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ప్రొఫెసర్‌ నియాన్‌ మార్చోన్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ (అకడమిక్స్‌) ప్రొ. ఎఫ్‌ఎం నదాఫ్, రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్, స్టేట్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వందనా నాయక్, ఉన్నత విద్యా డైరెక్టరేట్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సందేశ్‌ గాంకర్, సిద్ధి భండాంకర్, మెలాన్సీ మస్కరెన్హాస్, నెట్‌వర్క్‌ సిస్టమ్‌ ఇన్‌చార్జి డారిల్‌ పెరీరా తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 13 ఏళ్లకే 10వ తరగతి పూర్తి.. యాంకర్‌గా అదరగొడుతున్న అభిషేక్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top