13 ఏళ్లకే 10వ తరగతి పూర్తి.. యాంకర్‌గా అదరగొడుతున్న అభిషేక్‌ 

Abhishek Doing Well as an Anchoring Visakhapatnam - Sakshi

ప్రభుత్వ కార్యక్రమాల్లో తనదైన శైలిలో వ్యాఖ్యానం 

తండ్రి, సోదరి కూడా వ్యాఖ్యాతలే...  

వ్యాఖ్యాత.. కార్యక్రమాన్ని ఆద్యంతం చక్కని వాతావరణంలో నడిపించాలి. ప్రేక్షకులకు ఏమాత్రం విసుగు కలగకుండా తన మాటల మంత్రంతో మ్యాజిక్‌ చేయాలి. నవ్వుతూ.. నవ్విస్తూ.. ఎంతో ఈజ్‌గా యాంకరింగ్‌ చేయాలి. పెదవులు దాటి బయటకొచ్చే ప్రతి మాట చాలా ముఖ్యం. ప్రభుత్వ కార్యక్రమాల్లో అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. ఇందులో నేర్పరి పీతల అభిషేక్‌. యాంకరింగ్‌లో రాణిస్తూ.. పలువురి మన్ననలు పొందుతున్నాడు. – కంచరపాలెం(విశాఖ ఉత్తర) 

నగరంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో యాంకరింగ్‌ అంటే ముందుగుర్తొచ్చేది రాజేంద్రప్రసాద్, అతని పిల్లలు జుహిత, అభిషేక్‌. ఆయా కార్యక్రమాల్లో వీరు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తికట్టిస్తారు. తన మాటలతో మాయాజాలం చేస్తారు. వీరిలో అభిషేక్‌ ఇటీవల కాలంలో బాగా పాపులర్‌ అయ్యాడు. ప్రభుత్వ అనుమతితో 13 ఏళ్లకే అభిషేక్‌ 10వ తరగతి పరీక్షలు రాసి.. 9.8 జీపీఏతో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించాడు.


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో అభిషేక్‌ సెల్ఫీ

నాలుగేళ్ల ప్రాయంలోనే ఒడిశాలోని పారాదీప్‌లో జరిగిన నాటికల పోటీలో పెద్దలతో పోటీపడి నటించాడు. వారితో సమానంగా డైలాగ్‌లు చెప్పి అందరి ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. ఉత్తమ బాలనటుడిగా ఎంపికయ్యాడు. తర్వాత పలు నాటికలు, లఘు చిత్రాల్లో నటించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. 18 ఏళ్లకే జూన్‌–2022లో విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. పీజీలో చేరి సివిల్స్‌ కోసం ప్రిపేర్‌ అయ్యే విధంగా ప్లాన్‌ చేసుకున్నాడు అభిషేక్‌.  

16 ఏళ్లకే మొదలు
అభిషేక్‌ విద్యలోనే కాదు వ్యాఖ్యాతగా కూడా రాణిస్తున్నాడు. తనదైన శైలిలో వ్యాఖ్యానం చేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు. 16 ఏళ్ల వయసు నుంచే యాంకరింగ్‌ మొదలుపెట్టాడు. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న స్వాతంత్య్ర దినోత్సవం, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొన్న రిపబ్లిక్‌ డే వేడుకల్లో తెలుగులో యాంకరింగ్‌ చేసి.. అందరి ప్రశంసలు అందుకున్నాడు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో కూడా అభిషేక్‌ ముఖ్యపాత్ర వహించాడు. కేంద్ర మంత్రులు హర్దీప్‌ సింగ్‌ పూరి, సర్బానంద సోనోవాల్, శంతను ఠాకూర్‌ పాల్గొన్న మూడు భారీ కార్యక్రమాల్లో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో యాంకరింగ్‌ చేసి వారి మన్ననలు పొందాడు. 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాలు, మంత్రులు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు పాల్గొనే కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు, క్రిస్మస్‌ వేడుకలు, టూరిజం డే సెలబ్రేషన్స్‌ తదితర వేడుకల్లో అభిషేక్‌ వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు పొందాడు. ఈ కార్యక్రమాలను అద్భుతంగా నడిపించాడు. తన గంభీరమైన కంఠంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అభిషేక్‌.. అందరితోనూ మ్యాన్‌ ఆఫ్‌ మెటాలిక్‌ వాయిస్‌ కీర్తించబడుతున్నాడు. వందలాది సాంస్కృతిక, క్రీడా, సేవా, రాజకీయ కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేస్తున్న అభిషేక్‌కు పలు అవార్డులు వరించాయి. ఎన్నో ప్రశంసలు దక్కాయి. కళారత్న సంస్థ ‘యువరత్న’ ‘విశాఖరత్న’ అవార్డులతో సత్కరించింది. ఆయన ఇంట్లో ఓ గది బహుమతులతో నిండిపోయి ఉంటుంది. పైగా ఇంట్లో ముగ్గురూ యాంకర్లు కావడం మరో విశేషం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top