ఏపీ విధానాలు నచ్చాయి | A report released on Good Practices in various states | Sakshi
Sakshi News home page

ఏపీ విధానాలు నచ్చాయి

Published Mon, Dec 18 2023 3:03 AM | Last Updated on Mon, Dec 18 2023 3:03 AM

A report released on Good Practices in various states - Sakshi

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పాలనా విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని అంతర్‌ రాష్ట్ర మండలి ప్రశంసించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారని కితాబిచ్చింది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నారని, రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌ను గ్రామాల్లోనే అందుబాటులోకి తెచ్చారని కొనియాడింది.

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో భూ యజమానులకు కచ్చితమైన భూ హక్కు పత్రాలను అందజేస్తున్నారని..ఇదొక మంచి విధానమని (గుడ్‌ ప్రాక్టీస్‌) పేర్కొంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న గుడ్‌ ప్రాక్టీసెస్‌పై అంతర్‌ రాష్ట్ర మండలి ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. అందులో మన రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  
 
సచివాలయాలతో పాలనా వికేంద్రీకరణ  
♦ ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన పాలనా వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తద్వారా వివిధ సంక్షేమ పథకాలతోపాటు పలు ప్రభుత్వ సేవలను పౌరుల ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అవసరాలను తీర్చడంలో ఈ వ్యవస్థ వన్‌స్టాప్‌ సొల్యూషన్‌గా నిలిచింది. 

♦ గ్రామాల్లో 50 ఇళ్లకు.. పట్టణాల్లో 70–100 ఇళ్లకు ఒక వలంటీర్‌ చొప్పున పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 10 మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు తమ పరిధిలోని ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. ఆరు అంచెల్లో ట్రాక్‌ చేయడం ద్వారా పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా చెబుతూ దరఖాస్తు తిరస్కరిస్తున్నారు.  
 
సమగ్ర సర్వేతో భూ రికార్డుల శుద్ధీకరణ  
♦ దశల వారీగా సమగ్ర భూ సర్వేను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. డ్రోన్స్‌ ద్వారా ఏరియల్‌ ఫ్లయింగ్‌తో సర్వే చేయడంతో పాటు గ్రౌండ్‌ ట్రూథింగ్, రికార్డుల తయారీ, క్షేత్ర స్థాయిలో ధృవీకరణ, రికార్డుల అప్‌డేషన్, సరిహద్దు వివాదాలపై అప్పీల్స్, సెక్షన్‌–13 నోటిఫికేషన్‌ ప్రచురణ, ఫైనల్‌ రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్, స్టోన్‌ ప్లాంటేషన్, సబ్‌ డివిజన్స్‌.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లను క్రమానుగతంగా అమలు చేస్తున్నారు. 

♦ సరిహద్దుల ఆన్‌లైన్‌ పర్యవేక్షణ, జోనల్, నిబంధనలు, భూమిపై భౌతిక మార్పులతో సహా సమగ్ర భూసర్వే చేపట్టారు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా కచ్చితమైన భూ హక్కు పత్రాలను భూ యజమానులకు పంపిణీ చేస్తున్నారు. తద్వారా భూ రికార్డులు క్లీన్‌ అవుతాయి. ఇది చాలా మంచి విధానం.  
 
‘ఫ్యామిలీ డాక్టర్‌’తో ప్రజల్లో నిశ్చింత 
♦ డా.వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్టం చేసింది. ఇందులో భాగంగా రోగుల ఇంటి వద్దే వైద్య సేవలను అందిస్తోంది. తద్వారా చిన్న చిన్న జబ్బులకు పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం తప్పిందని ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమం.  
♦ ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌–వెల్నెస్‌ సెంటర్ల ఏకీకరణ ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమలు చేస్తోంది. 
♦ గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పన డా.వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేసింది. 
♦ ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో ఒక కమ్యునిటీ హెల్త్‌ ఆఫీసర్, ఒక ఏఎన్‌ఎం, ముగ్గురు నలుగురు ఆశా వర్కర్లను నియమించారు. 
♦ విలేజ్‌ క్లినిక్స్‌ భవనాలను 932 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వార్టర్‌తో సహా నిరి్మంచారు. వీటిల్లో 105 రకాల మందులు, 14 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 
♦ ప్రతీ పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రతీ పీహెచ్‌సీకి విలేజ్‌ క్లినిక్స్‌ను అనుసంధానించారు. 
♦ 104 మెబైల్‌ మెడికల్‌ యూనిట్‌తో సహా ఫ్యామిలీ డాక్టర్‌ సేవలను అందిస్తున్నారు. ఒక డాక్టర్‌ పీహెచ్‌సీలో ఓపీ సేవలను అందిస్తే.. మరో డాక్టర్‌ విలేజ్‌ క్లినిక్స్‌కు హాజరవుతున్నారు. 
♦ ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో సాధారణ ఓపీలతో పాటు నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ నిర్వహణ, యాంటినేటల్‌ కేర్‌.. తల్లులు, నవజాత శిశువులకు పోస్ట్‌నేటల్‌ కేర్, అంగన్‌వాడీలు, పాఠశాలల సందర్శన, రక్తహీనత పరీక్షలు, పర్యవేక్షణ, మంచానికే పరిమితమైన రోగుల ఇళ్ల సందర్శన, పంచాయతీల సమన్వయంతో గ్రామ పారిశుధ్య పర్యవేక్షణ జరుగుతోంది. 
♦ ఈ ఏడాది మే 3 నాటికి గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ సేవలను 97,11,224 మంది ప్రజలు వినియోగించుకున్నారు. 
 
రైతులకు అండగా ఆర్బీకేలు  

గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి విధానమని, తద్వారా ప్రభుత్వం రైతుల సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌ను ఉంటున్న ఊళ్లలోనే పొందే అవకాశం కల్పిందని అంతర్రాష్ట్ర మండలి నివేదిక పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వారికి పనికొచ్చే ఇతర సేవలనూ ఆర్బీకేలు అందిస్తున్నాయని తెలిపింది.

అన్ని పంటలను ఈ–క్రాప్‌ ద్వారా నమోదు చేస్తూ, వాస్తవ సాగుదారు సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకుంటోందని.. తద్వారా నిజమైన సాగుదారులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలను అందిస్తోందని ప్రశంసించింది. రైతుల నుంచి పంటల కొనుగోలు కూడా ఆర్బీకేల్లోనే చేపడుతోందని తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదాతలను అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తోందని కొనియాడింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement