అటవీ శాఖ పునర్వ్యవస్థీకరణ

Reorganization of Forest Department Andhra Pradesh - Sakshi

కొత్త జిల్లాల వారీగా డివిజన్లు 

26 జిల్లాలకు 32 డివిజన్లు.. కొత్తగా 9 

జిల్లాకో టెరిటోరియల్‌ లేదా సోషల్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ 

5 లాగింగ్‌ డివిజన్లు, తెలుగు గంగ డివిజన్‌ రద్దు 

కొత్త పోస్టులు సృష్టించకుండా ఉన్న వారితోనే సర్దుబాటు 

ఎక్కువ అడవులున్న జిల్లా అల్లూరి.. అడవే లేని జిల్లా పశ్చిమ గోదావరి

సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలవారీగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రతి జిల్లాలో ఒక అటవీ డివిజన్‌ (టెరిటోరియల్‌ లేదా సోషల్‌ ఫారెస్ట్‌) ఏర్పాటు చేసింది. అవసరం లేని, కాలం చెల్లిన 6 డివిజన్లను మూసివేసి వాటి స్థానంలో కొత్తగా 9 డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో 26 జిల్లాలకు ఇప్పుడు 32 డివిజన్లు ఉన్నాయి. గతంలో 13 జిల్లాలకు 23 డివిజన్లు ఉండేవి. పునర్వ్యస్థీకరణ తర్వాత కొత్తగా పార్వతీపురం మన్యం, చింతపల్లి, రంపచోడవరం, రాజమండ్రి, కోనసీమ, భీమవరం, మచిలీపట్నం, బాపట్ల, పల్నాడు డివిజన్లు ఏర్పాటయ్యాయి. 

వెదురు, కలప వెలికితీత కోసం ప్రత్యేకంగా ఉన్న చింతూరు, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, గిద్దలూరు, నంద్యాల లాగింగ్‌ డివిజన్లను రద్దు చేశారు. డివిజన్ల పరిధి, కలప తగ్గడంతో వీటిని మూసివేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు కట్టినప్పుడు దానికి పరిహారంగా అడవిని పెంచడానికి ఏర్పాటైన టీజీపీ డివిజన్‌ను కూడా రద్దు చేశారు.  

► గతంలో సోషల్‌ ఫారెస్ట్, టెరిటోరియల్‌ డివిజన్లు విడిగా ఉండేవి. కొత్త డివిజన్లు చిన్నవి కావడంతో ఈ రెండింటినీ కలిపి ఒకటిగా చేశారు. గతంలో ఉన్న 13 సోషల్‌ ఫారెస్ట్‌ డివిజన్లను పదికి తగ్గించారు. 
► పునర్వ్యవస్థీకరణ తర్వాత 3 జిల్లాల్లో మాత్రమే ఒకటికంటే ఎక్కువ డివిజన్లు ఏర్పాటయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు డివిజన్లు (పాడేరు, చింతపల్లి, చింతూరు, రంపచోడవరం) ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 3 డివిజన్లు (కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల), ప్రకాశం జిల్లాలో 3 డివిజన్లు (మార్కాపురం, గిద్దలూరు, ప్రకాశం) పెట్టారు. మిగిలిన 23 జిల్లాల్లో ఒక్కో డివిజన్‌ (టెరిటోరియల్‌) ఏర్పాటయ్యాయి. 
► వన్యప్రాణి విభాగం (వైల్డ్‌ లైఫ్‌) డివిజన్లను గతంలో మాదిరిగా ప్రత్యేకంగానే ఉంచారు. ఏలూరు (కొల్లేరు, కృష్ణా అభయారణ్యాలు), సూళ్లూరుపేట (పులికాట్, నేలపట్టు అభయారణ్యాలు) వైల్డ్‌లైఫ్‌ డివిజన్లను అలాగే ఉంచారు. నాగార్జునసాగర్‌ – శ్రీశైలం టైగర్‌ రిజర్వు పరిధిలోని కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం డివిజన్లను అలాగే ఉంచారు. ఈ నాలుగింటికీ టెరిటోరియల్, వైల్డ్‌ లైఫ్‌ పరిధి రెండూ ఉంటాయి. 

పరిపాలన సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరణ 
కొత్త పోస్టులు సృష్టించకుండా ఉన్న వాటినే సర్దుబాటు చేసి పునర్వ్యవస్థీకరణ చేశాం. దీనివల్ల పరిపాలన సౌలభ్యంతోపాటు జిల్లాకు ఒక డివిజన్‌ ఉంటుంది. రద్దు చేసిన డివిజన్లలోని ఉద్యోగులను కొత్త వాటిలో సర్దుబాటు చేస్తున్నాం.   
 – వై మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌  

అటవీప్రాంతం లేని జిల్లా పశ్చిమగోదావరి 
పశ్చిమగోదావరి జిల్లా అటవీ ప్రాంతం లేని జిల్లాగా ఉంది. నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన ఈ జిల్లాలో ఒక్క ఎకరం కూడా అటవీ భూమి లేదు. అయినా అక్కడ అటవీ డివిజన్‌ ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో అత్యధికంగా 8,03,039.45 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. బాపట్ల, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 10 వేల హెక్టార్లకంటె తక్కువ అటవీ విస్తీర్ణం ఉంది. విశాఖపట్నం 14,512 హెక్టార్లతో పూర్తి అర్బన్‌ అటవీ ప్రాంతంగా మారింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top