సప్త వాహనాలపై శ్రీనివాసుని వైభవం | Rath Saptami celebrated in Tirumala | Sakshi
Sakshi News home page

సప్త వాహనాలపై శ్రీనివాసుని వైభవం

Feb 5 2025 5:18 AM | Updated on Feb 5 2025 5:18 AM

Rath Saptami celebrated in Tirumala

తిరుమలలో ఘనంగా రథసప్తమి 

1.50 లక్షల మందికి పైగా హాజరు

తిరుమల: రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో సప్త వాహనాలపై కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. లక్షా 50 వేల మందికి పైగా తరలివచ్చిన భక్తజనులు..వాహన సేవలను దర్శించుకుని పునీతులయ్యారు. రథసప్తమి పర్వదినం..ఒకరోజు బ్రహ్మోత్సవాలను తలపించింది. సూర్యోదయాన సూర్య ప్రభ వాహనంతో ప్రారంభమైన సప్త వాహన సేవోత్సవం..రాత్రి చంద్రప్రభ వాహనంతో పరిసమాప్తమైంది. 

శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులకు అభ్యంగనం ఆచరించారు. చక్రస్నానాన్ని శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు నిర్వహించారు. వాహన సేవల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
   
చిన్న శేష వాహనంలో అపశ్రుతి 
రథసప్తమి వేడుకల్లో శ్రీవారి గొడుగు గాలికి ఒరిగింది. సూర్యప్రభ వాహనం అనంతరం చిన్నశేష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. ఈ ఊరేగింపు సమయంలో వాహనంపై స్వామివారికి ఇరువైపులా ఛత్రాలు ఉంచుతారు. అర్చకులు వీటిని పట్టుకొని వస్తారు. వాహనం ముందుకు కదులుతుండగా..ఒక్కసారిగా వాహనం ఎక్కువగా అదిరిపోవడంతో గొడుగు కిందకు వాలిపోయింది.

వాహన సేవల్లో న్యాయమూర్తులు 
మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్పతి రాజేంద్రన్‌ శ్రీరామ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ శ్రీవారి దర్శనం అనంతరం మాడ వీధుల్లో నిర్వహించిన వాహన సేవల్లో పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement