రెండు నెలల తర్వాత స్వగ్రామానికి శంకరమ్మ మృతదేహం
పుల్లంపేట: మలేషియాలో మరణించిన కోనయ్యగారిపల్లెకు చెందిన బొమ్మవరం శంకరమ్మ మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంది. శంకరమ్మ బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల కిందట మలేషియా వెళ్లింది. ఈ క్రమంలో కరోనరీ ఆర్టరీ వ్యాధితో కలిగే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్‌తో ఆమె గతేడాది డిసెంబర్ నెల 21వ తేదీన మరణించినట్లు అక్కడి ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఇండియన్ ఎంబసీ ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్‌కు సమాచారం అందించారు. దీంతో ఎన్నారై అసోసియేషన్‌కు చెందిన ఉపాధ్యక్షుడు కృష్ణకు, ముత్తినేని శంకరమ్మ వివరాలను ఆమె కుటుంబసభ్యులు సమర్పించడంతో మృతదేహాన్ని ఫిబ్రవరి 13వ తేదీన మలేషియా ఎయిర్‌లైన్స్ ఎం 180 ద్వారా చైన్నెకి చేరేలా ఏర్పాట్లు చేశారు. అంతేగాక ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈఓ డాక్టర్ కృష్ణమోహన్ చైన్నె విమానాశ్రయం నుంచి కోనయ్యగారిపల్లెకు ఉచిత అంబులెన్స్ సదుపాయం కల్పించారు. శంకరమ్మ పార్థివదేహాన్ని స్వదేశానికి పంపడానికి ఇండియన్ ఎంబసీ పూర్తిగా ఖర్చు భరించిందని మలేషియా ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్‌రెడ్డి తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి సహకరించిన ఇండియన్ హై కమిషనర్ బీఎన్‌రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు కృష్ణమోహన్, మోహన్‌రెడ్డికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు.
రెండు నెలల తర్వాత స్వగ్రామానికి శంకరమ్మ మృతదేహం


